రివ్యూ : యమన్‌

299
Yaman Movie Review
- Advertisement -

నకిలీ, డా. సలీమ్‌, బిచ్చగాడు, బేతాళుడు చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోనీ. ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యమన్‌’. కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా చిత్రాలను చేస్తున్న విజయ్‌ ఇప్పుడు పొలిటికల్‌ థ్రిల్లర్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్‌ఆంటోని ఎఫెక్ట్‌తో యమన్‌ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో విజయ్‌ఆంటోని ఆకట్టుకున్నాడా..? విజయ్‌ఆంటోనికి పొలిటికల్‌ యాక్షన్‌ సెట్ అయిందా లేదా చూద్దాం..
Yaman Movie Review
కథ:
దేవర కొండ గాందీ(విజయ్‌ ఆంటోని) రాజకీయాల్లో చురుకుగా ఉండి కౌన్సిలర్‌గా ఎదుగుతాడు. నచ్చిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుంటాడు. వారికి పుట్టిన బిడ్డ అశోక చక్రవర్తి(విజయ్‌ ఆంటోని). పాండు రంగారావు కారణంగా అశోక్‌ తండ్రి, మావయ్యలు గొడవ పడి చనిపోతారు. అశోక్‌ తాతయ్య దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. సాంబ, నరసింహ ప్రాణ స్నేహితులు. రాజకీయ కారణాలతో వారిద్దరూ విడిపోతారు. బద్ధ శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓ సందర్భంలో సాంబ అనుకోకుండా ఓ ప్రమాదానికి గురై గాయాలపాలవుతాడు. ఆ ప్రమాదానికి తానే కారణం అంటూ అశోక చక్రవర్తి(విజయ్‌ ఆంటోని) ఆరెస్ట్‌ అయ్యి సాంబ దృష్టిలో పడతాడు. సాంబ అశోక చక్రవర్తిని చంపడానికి ప్రయత్నిస్తాడు. నరసింహ అశోక్‌ను జైలు నుండి విడిపిస్తాడు. జైలు నుండి వచ్చిన తర్వాత అశోక్‌ తన తెలివి తేటలతో చాలా ఎత్తుకు ఎదుగుతాడు. ఇంతకు పాండు రంగారావు ఎవరో అశోక్‌కు తెలిసిందా? అశోక్‌ తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
ఈసినిమాకు విజయ్‌ఆంటోనితోనే మంచి హైప్‌ వచ్చిందనని చెప్పవచ్చు. ఈసినిమాలో విజయ్‌ఆంటోనినే ఎక్కువగా అన్ని సన్నివేశాల్లో ఉండేలా చూశారు. అతనికోసమే సినిమాచూస్తున్న ప్రేక్షకులకు అలా విజయ్‌ ప్రతిసీన్లో కనిపిస్తుండటం సంతృప్తిగా ఉంటుంది. ఈసినిమాలో విజయ్‌నటన చాలా బాగుంది. ఒక మాములు స్థాయి వ్యక్తి నుంచి చిన్నస్థాయి రాజకీయ నాయకుడిగా అతను మారిన విధానం చాలా బాగా చూపించారు. అలాగే కరుణాకర్ పాత్ర చేసిన త్యాగరాజన్ నటన కూడా మెప్పించింది. సినిమాలో మరో ప్రధానమైన అంశం ఏమిటంటే కథలోని మూడు ప్రధాన పాత్రలు ఒకరిని ఒకరు మోసం చేయడాని చేసే ప్రయత్నం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం వంటి వాటిని కథనంలో చాలా బాగా చూపించారు. దీంతో పాటే నడిచే హీరో లవ్ ట్రాక్ ఈ ప్రధాన కథనానికి ఏమాత్రం అడ్డు తగలకపోవడం విశేషం.
Yaman Movie Review
మైనస్ పాయింట్స్‌ :
సినిమా కథనం బాగానే ఉన్నా ప్రత్యర్థుల మధ్య జరిగే పొలిటికల్ గేమ్ లోని కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడికి చాలా వరకు కనెక్ట్ కాలేదు. దీంతో ఆ సందర్భాల్లో కాస్త నిరుత్సాహం ఏర్పడింది. ఇంకొన్ని సందర్భాల్లో అయితే చిత్రం సరిగా కనెక్టవకపోవడం కాస్త ఇబ్బందిగా తోచింది కూడా. హీరోయిన్ మియా జార్జ్ కు కేవలం రెండు పాటలు, 5 సన్నివేశాలకు మాత్రమే పరిమితమవడం కాస్త నెగెటివ్ ప్రభావం చూపింది. సినిమా మాతృక తమిళం కావడం వలన తెలుగు వర్షన్ లో సైతం చాలా చోట్ల తమిళ వాతావరణం కనబడింది. నటీనటుల నటన కూడా తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించింది. దర్శకుడు నేమ్ బోర్డ్స్ వంటి వాటిని కవర్ చేసినా ఆ ఫీల్ పోవడం కష్టమైంది.
Yaman Movie Review
సాంకేతిక విభాగం:
టెక్నికల్ పరంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. దర్శకుడు జీవ శంకర్‌ ఈకథను బాగానే తెరకెక్కించాడు.  పొలిటికల్‌ సంభాషణలు ఆకట్టుకుంటాయి. కానీ ఇంకాస్త పదును పెడితే బాగుండేది. ద్వితీయార్ధంలో వచ్చే పాటలు, ఫైట్‌లు అందులో భాగమే. ఆంటోనీది ద్విపాత్రాభినయమే అయినా తండ్రి పాత్రకు స్కోప్‌ లేదు. కథానాయిక మియాజార్జ్‌తో సహా మిగిలిన వారు తమ పరిధి మేర చక్కగా నటించారు. ఈ సినిమాకు మ్యూజిక్ బాగుంది. కానీ పాటలు బాగలేవు. వీర సెంథిల్ రాజ్ ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు:
కొందరు వ్యక్తుల మధ్య జరిగే ఈ పొలిటికల్ గేమ్ అనే అంశం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాలో విజయ్ ఆంటోనీ తనకు ఎదురైన కష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కున్నాడు, ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు, అనుకున్నది ఎలా సాధించాడు అనే అంశాలు ప్రేక్షకులకు మంచి ఆసక్తిని కలిగిస్తాయి. సినిమా ఏకైక బలహీనంగా ఉన్న కథనం యొక్క నిదానాన్ని పట్టించుకోకపోతే ఈ చిత్రాన్ని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

విడుదల తేదీ:24/02/2016
రేటింగ్:   3/5
నటీనటులు:విజయ్ ఆంటోని, మియా జార్జ్
సంగీతం: విజయ్ ఆంటోని
నిర్మాతలు: మిర్యాల రవీందర్ రెడ్డి, లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: జీవ శంకర్

- Advertisement -