ఈ చట్టాల గురించి తెలుసుకుంటే అమ్మాయిలు సేఫ్..!

292
Women Issues and laws
- Advertisement -

మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా.. ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. పుట్టక ముందే భ్రూణ హత్యలు.. పుట్టిన తర్వాత వివక్షలు. మగువల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. ఆడ పిల్ల అంటేనే ఆర్థిక గుదిబండగా భావిస్తున్నారు. ఆడదానిలో కొందరు విలాస వస్తువును చూస్తున్నారు. మరి కొందరు ప్రేమ పేరుతో వంచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ అమ్మాయి తన రక్షణ కోసం చేసిన చట్టాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.అవేంటో చూద్దాం…

– సెక్షన్ 100-ఆత్మరక్షణకు, ఒక వ్యక్తి మీద దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు.

-166(బి) సెక్షన్ ప్రకారం.. బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సంబంధిత సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు.

-228(ఏ) సెక్షన్ – లైంగికదాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించకూడదు. అలా చేసిన పక్షంలో సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు.

-354 సెక్షన్ – స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు.

-376 సెక్షన్ కింద.. 18ఏళ్లలోపు ఉన్న యువతితో సెక్సులో పాల్గొంటే అది చట్టరీత్యా వ్యతిరేకం. ఒక వేళ ఆమె ఇష్ట ప్రకారమే చేసినా సదరు పురుషుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది.

-376 సెక్షన్ కింద వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తే వారిపై చర్య తీసుకునేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్ కింద కేసు చేస్తే రెండు నెలల్లో విచారణ చేసి తీర్పు ఇవ్వాలి.

-భార్య ఉండగా.. మరో పెళ్లి చేసుకుంటే 494 సెక్షన్ ప్రకారం అతని మీద కేసు నమోదు చేయవచ్చు. కేసు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

-498(ఏ) సెక్షన్- ఓ వివాహితను ఆమె భర్త కానీ, భర్త బంధువులు కానీ శారీరకంగా, మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించినా.. ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయవచ్చు. కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.

-509 సెక్షన్ -మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకర వస్తువులను ప్రదర్శించినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు.

-రోడ్డు మీద నడుస్తుంటే, బస్టాప్‌లో, ఇంకెక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ, శబ్దాలు చేస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే సెక్షన్ 294 ప్రకారం వారిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం మూడు నెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష పడుతుంది. లేదా కొంత జరిమానా వేయవచ్చు.

-ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, వారిపై సెక్షన్ 354(డీ) ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ తోటి ఉద్యోగులు గానీ, మీ బాస్ గానీ ఆఫీసు పనుల్లో అలుసుగా తీసుకొని సెక్సువల్ కాంటాక్ట్ కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.

-ఒకరి ఫొటోను మార్ఫింగ్ చేసి వారి శరీరాలకు ముఖాన్ని అతికించి ఇబ్బందికరంగా ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్న సంఘటనలు ఈ మధ్య బాగా పెరిగాయి. ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైతే సెక్షన్ 499 ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష పడవచ్చు.

-ఒక మహిళను దౌర్జన్యంగా, బలప్రయోగం వల్ల తన శరీరంపై ఉన్న దుస్తులను తీసివేసినా ఆ వ్యక్తికి సెక్షన్ 354(బీ) ప్రకారం 3-7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

-ఒక మహిళ, విద్యార్థినికి సంబంధించిన రహస్య వ్యక్తిగత ఫొటోలు తీయడం, వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా 354(సీ) సెక్షన్ కింద ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

-వ్యభిచారానికి, 18 ఏళ్లలోపు బాలికను కొనుగోలు చేసినా సెక్షన్ 373 ప్రకారం పదేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు జరిమానా విధిస్తారు.

-నిండు గర్భిణిని చంపాలనే ఉద్దేశంతో చేపట్టిన ఒక చర్య పర్యవసానంగా ఆమె చనిపోతే నేరస్థుడిపై సెక్షన్ 316 ప్రకారం ప్రాణహరణం కింద నేరం మోపబడుతుంది. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు మరణిస్తే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది.

-ఒకరికన్నా ఎక్కువ మంది వ్యక్తులున్న ఒక బృందంలోని సభ్యులు ఒక మహిళపై లైంగికదాడి చేసిన సందర్భాల్లోనూ వారిలో ప్రతి వ్యక్తి నేరానికి పాల్పడినట్లే పరిగణించ బడుతుంది.
సెక్షన్ 376-బీ కింద ప్రతి ఒక్కరికీ 20 ఏళ్లు తగ్గకుండా జీవితఖైదు శిక్ష విధిస్తారు.

-బాలికను ఏదోవిధంగా వ్యభిచారానికి మారేందుకు ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా సెక్షన్ 366(ఏ) కింద పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.

-స్త్రీ, బాలికను గానీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తిని వివాహం చేసుకునేందుకు బలవంతంగా అంగీకరించాలని ఒత్తిడి తేవడం, ఆ స్త్రీని అపహరిస్తే బలవంతంగా వివాహం చేసుకుంటే సెక్షన్ 366 కింద పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది.

ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇలాంటి చట్టాలు రాజ్యాంగంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ మహిళలు తెలుసుకోవాలి. మీ చుట్టూ జరిగే సంఘటనలపై మౌనంగా ఉండకండి.. గొంతు విప్పి మాట్లాడండి.. మీ మీద జరిగే దాడులను ఉపేక్షించకండి.

- Advertisement -