బతికున్నంత వరకు మీ కోసమే పనిచేస్తా…

194
- Advertisement -

నూతనంగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాను ప్రారంభించేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తాత్కాలిక కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం… సభా వేదిక వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘సరిగ్గా 30 ఏండ్ల కింద 1983వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఇదే రోడు వెంట కరీంనగర్‌ వెళ్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారితో పూలమాల వేయించి.. సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్‌ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అప్పటి పరిస్థితుల వల్ల సిద్దిపేట జిల్లా కాలేకపోయిందని’ కేసీఆర్ తెలిపారు.

జీవితంలో అత్యంత అరుదైన అదృష్టం తనకు లభించిందన్నారు కేసీఆర్. తాను సిద్దిపేటలో పెరిగానని… సిద్దిపేటలో తిరగని సంది.. నిద్రపోని గ్రామం లేదన్నారు. తనను ఇక్కడి ప్రజలే తెలంగాణ కోసం పంపించారని.. వారి ఆజ్ఙతోనే తెలంగాణ తీసుకొని వచ్చానన్నారు. ఆ గౌరవం ఏనాటికైనా సిద్దిపేట గడ్డకే దక్కుతుందన్నారు. దేశం మొత్తం అబ్బురపడుతున్నటువంటి పరిపాలనా సంస్కరణ సిద్దిపేట గడ్డ నుండే ప్రారంభమవడమనేది గొప్ప విషయమన్నారు. తనకు ఈ రోజు అత్యంత సంతోషమైన రోజని.. తన చేతులతో సిద్దిపేట జిల్లాగా ఏర్పడడం తాను జీవితంలో మర్చిపోలేనని కేసీఆర్ అన్నారు.

బతికున్నంత వరకు మీ కోసం పనిచేస్తా, మీరు దీవిస్తూ ఉండండి, మీ కోసం పనిచేస్తూ పోతా. నేను రాజీనామా చేసి పోయేటపుడు కళ్లల నీల్లు వచ్చినయి. సిద్దిపేటకు ఎలా అని బాధపడ్డాను. కానీ యువకుడు హరీష్ చేతిలో సిద్దిపేట అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. హారీష్‌ రావు కోరినట్లు వచ్చే సంవత్సరమే మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామన్నారు. తాను పుట్టిన ఈ గడ్డ కోసం ప్రత్యేకంగా రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నానని తెలిపారు.

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేటలో అడుగుపెట్టడంతో ఈ నేల పులకించి పోతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా ప్రారంభమైన సందర్బంగా ఆయన రోడ్‌షోలో మాట్లాడారు. తనకు మాట్లాడడానికి మాట రావడంలేదన్నారు. అంత ఆనందంగా ఉందని తెలిపారు. మన సిద్దిపేట జిల్లాను సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేయడం ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట అభివృద్దిలో సీఎం కేసీఆర్ పాత్ర మరవలేదనిదన్నారు. ఏ జిల్లానేతే కావాలని 1983లో పిటిషన్ ఇచ్చారో ఇవాళ అదే జిల్లా ఏర్పాటు జీవోపై సీఎం కేసీఆర్ సంతకం చేశారని వివరించారు. చరిత్రలో సీఎం కేసీఆర్ పేరు నిలిచి పోతోందని తెలిపారు.

- Advertisement -