సర్కారు బడికి కలెక్టర్ కూతురు…హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు

179
vikarabad collector masrat khanam ayesha

ప్రస్తుతం ఉన్న రోజుల్లో తమ పిల్లలను సర్కార్ బడిలో చదివిపించేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. చాలా మందికి సర్కార్ బడులపై నమ్మకం పోయింది. అప్పు చేసి అయినా సరే ప్రైవేటు స్కూళ్లలో చదివించాలని చూస్తున్నారు.ఇక గవర్నమెంట్ స్కూళ్లలో చదువుచెప్పే టీచర్లు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకే పంపిస్తున్నారు. కానీ ఓ కలెక్టర్ ఇందుకు భిన్నంగా తన కూతురిని సర్కార్ బడిలోనే చదవించి అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

తెలంగాణలో సర్కారు బడుల మీద ఉన్న నమ్మకంతో ఓ కలెక్టరమ్మ మాత్రం తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ మస్రత్‌ ఖానం అయేషా తన కుమార్తెను ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారు.

అయేషా తన కుమార్తె సబీష్ రాణియాను ఐదో తరగతిలో చేర్పించారు. గతంలో సబీష్ రాణియా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రయివేట్ స్కూళ్లో నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. ప్రయివేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని భావించిన కలెక్టరమ్మ తన కూతుర్ని గురుకుల పాఠశాలలో డేస్కాలర్‌గా చేర్పించారు.