సొంత గూటికి రాములమ్మ..?

564
vijayashanthi
- Advertisement -

టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తిరిగి సొంత గూటికి చేరనున్నారా…?కొంతకాలంగా కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న రాములమ్మ పార్టీ మారాలని డిసైడ్ అయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయశాంతి తర్వాత సొంత పార్టీ స్ధాపించడం,టీఆర్ఎస్‌లో చేరడం,తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో విజయశాంతి తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీ,కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకుని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న కాషాయ నేతలు విజయశాంతిని చేర్చుకోవడం ద్వారా పార్టీకి సినీ గ్లామర్ అద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న విజయశాంతితో 2023 ఎన్నికల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని కాషాయ నేతలు స్కెచ్‌ వేస్తున్నారు.

ఇక విజయశాంతి సైతం పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే విజయశాంతి కాషాయ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచే విజయశాంతిని పార్టీలో చేర్చుకోవడానికి జోరుగా ప్రయత్నాలు మొదలయ్యాయని రాజకీయవర్గాల్లో డిస్కషన్‌ జరుగుతోంది. విజయశాంతిని మళ్లీ బీజేపీలోకి తీసుకొస్తే, పార్టీకి మహిళా ఓటర్లు మరింత దగ్గర కావడంతో పాటు , రాములమ్మ పేరుతో మాస్ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని ఆలోచిస్తున్నారు కమలం పార్టీ నేతలు. మొత్తంగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

- Advertisement -