‘వాళ్లిద్దరి మధ్య’ తొలి తలుపులోనే…

777
Neha krishna
- Advertisement -

తొలి చూపు… తొలి వలపు- ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య ఓ తలుపు కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద కథే ఉంటుంది… అది ఓ బ్లాక్ బస్టర్ హిట్ కు కూడా నాంది పలుకవచ్చు. విషయంలోకి వస్తే ‘బాబి’ సినిమాలోకి వెళదాం. ఇది హిందీ ‘బాబి’సుమా. రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్, డింపుల్ కపాడియా జంటగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ అప్పటికే హిందీలో వచ్చిన ప్రేమ కథల రికార్డులను తిరగరాసింది. ఇందులో హీరో రిషికపూర్, హీరోయిన్ డింపుల్ కపాడియా ఇంటికి రాగానే ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. నిజానికి ఇది రాజ్ కపూర్ స్వీయ అనుభవమే. ఆయన నిజజీవితంలో నర్గిస్ ను అలాగే కలుసుకున్నారట. దాన్ని సినిమాలో చూపించాలని ఎంతో తహతహలాడినా కథలు సహకరించలేదు. ఆ కోరికను ‘బాబి’ తీర్చింది. ఆ సినిమాలో హీరోయిన్ తొలి సన్నివేశం కూడా అదే.

దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ సినిమాను చిన్నపుడు చూసి థ్రిల్ అయిపోయారు. దర్శకుడయ్యాక ఇలాంటి షాట్ తీయాలని అనుకున్నా కుదరలేదట. ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా తీర్చింది అంటారు ఆదిత్య. ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ నేహాకృష్ణ పై ఇలాంటి సన్నివేశాన్నే ఆదిత్య చిత్రీకరించారు. వినాయకుడు బొమ్మ చెక్కి ఉన్న తలుపును హీరో విరాజ్ అశ్విన్ తట్టగానే, హీరోయిన్ నేహాకృష్ణ తలుపు తీస్తుంది. ఇది ఆమె కెరీర్ లో మొదటిరోజు మొదటి షాట్. ఈ వినాయకుడి తలుపు వాళ్లిద్ధిరి ప్రేమకు ఎలాంటి విఘ్నాన్ని అయినా కలిగించవచ్చనే సందేహాన్ని ప్రేక్షకులకు కలిగించే ఉద్ధేశంతోనే ఈ సింబాలిక్ షాట్ ను ఆదిత్య తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

Heroine neha krishna

ఈ విషయంపై వి.ఎన్. ఆదిత్యను ప్రశ్నిస్తే ‘బాబిలోని సన్నివేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఒక రియల్ లైఫ్ లో అంకురించిన ప్రేమ, ఒక బ్లాక్ బస్టర్ సినిమా లవ్‌స్టోరీకి ఒక షాట్ అయింది. డింపుల్ కపాడియాపైన షూటింగ్ చేసిన మొదటి షాట్ కూడా అదే. ఆ దృశ్యం చిన్నప్పటినుంచీ నాతో ట్రావెల్ అవుతూనే ఉంది. ఇలాంటి సన్నివేశాన్ని తెరపై చూపించే అవకాశం నాకు ఇన్నాళ్లకు దక్కింది. అయితే ఆ కథ వేరు.. ఈ కథ వేరు. అందులో సున్నిపిండి ఉంది.. ఇందులో లేదు.. అంతే తేడా’ అని వివరించారు. తెలుగుసినిమా పరిశ్రమలోకి హీరోయిన్ నేహాకృష్ణ ప్రవేశాన్ని ఇలా విఘ్నేశ్వరుడి తలుపు ద్వారా స్వాగతించాలనే ఉద్దేశంతో కూడా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు ఆయన చెప్పారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి నిర్మాత అర్జున్ దాస్యన్. నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ ” షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . సినిమా చాలా బాగా వచ్చింది. అతి త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటిస్తాము ” అని తెలిపారు.

తారాగణం: విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్, నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది, సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ తదితరులు. సాంకేతిక బృందం :స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి.పతి, సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ, కెమెరా: ఆర్.ఆర్.కోలంచి, ఆర్ట్: జెకేమూర్తి, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సూరపనేని కిషోర్, నిర్మాత: అర్జున్ దాస్యన్, కథ – దర్శకత్వం: వి.ఎన్.ఆదిత్య .

- Advertisement -