జగన్‌ ఒక్కరే ప్రమాణస్వీకారం..!

373
jagan oath
- Advertisement -

ఏపీలో సునామీ సృష్టించి తిరుగులేని మెజార్టీతో 151 స్ధానాలను కైవసం చేసుకున్న వైఎస్ జగన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ జరిగే వైసీపీఎల్పీ భేటీలో జగన్‌ను శాసనసభాపక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనుండగా ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. ఇక జగన్‌తో పాటు ఎంతమంది మంత్రిపదవి చేపడుతారోనన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. జగన్‌ ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

జూన్‌ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని జగన్‌ భావిస్తున్నారట. తొలి దశలో 18-20మంది సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకుంటారని సమాచారం. తర్వాత జరిగే విస్తరణలో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుందని అంటున్నారు.

మంత్రి పదవులకు ఆశావాహులకు ఎక్కువగా ఉండటంతో కేబినెట్ విస్తరణ జగన్‌కు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో పలువురికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగానే ప్రకటించారు. దీనికి తోడు సామాజిక సమీకరణలు,ప్రాంతాల ప్రాతినిధ్యం నేపథ్యంలో ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే జగన్‌ మాత్రం తన వీరవిధేయులకే ప్రాధాన్యత కల్పిస్తారని.. కేబినెట్ కూర్పుపై అధినేత నిర్ణయమే ఫైనల్‌ అని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -