ప్రజల బడ్జెట్‌ సదస్సులో సింగరేణికి ఊరట

321
Singareni
- Advertisement -

కేంద్ర ఆర్ధిక మరియు కార్పోరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హైద్రాబాద్‌ లో నేడు నిర్వహించిన ‘‘ప్రజల బడ్జెట్‌’’ సదస్సులో సింగరేణికి ఊరట కలిగించే పరిణామం ఒకటి చోటుచేసుకుంది. 2017 జూన్‌ నెలలో బొగ్గు స్టాకును బొగ్గు అమ్మకంగా భావిస్తూ కేంద్ర జి.ఎస్‌.టి. విభాగం వారు జారీ చేసిన 236 కోట్ల రూపాయల క్లీన్‌ ఎనర్జీ సెస్‌ నోటీసును ఉపసంహరించుకోవడానికి సింరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ చేసిన విజ్ఞప్తిపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సమక్షంలో సానుకూలంగా స్పందించారు.

సింగరేణి సంస్థ డైరెక్టర్‌ ఫైనాన్స్‌ శ్రీ ఎన్‌.బలరాం ఈ సమస్యను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకురాగా ఆమె పక్కనే ఉన్న సెక్రటరీ (రెవిన్యూ) అజయ్‌ భూషన్‌ పాండే సానుకూలంగా స్పందించారు. ‘‘మీ సమస్యను అర్ధం చేసుకున్నం. మీరు దీనిపై నోటు పంపించండి. తప్పక పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం’’ అని పూర్తి సానుకూలతను తెలిపారు. దీంతో గత రెండేళ్లుగా సింగరేణిని ఇరకాటంలో పెడుతున్న డబుల్‌ టాక్స్‌ చెల్లింపు వ్యవహారం ముగింపుకు సానుకూలత ఏర్పడింది.

ఇంతకీ ఏమిటి డబుల్‌ టాక్స్‌

జి.ఎస్‌.టి అమలులోకి రాకపూర్వం అనగా జూలై 1, 2017 కి ముందు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రకాల టాక్సులను సింగరేణి చెల్లిస్తుండేది. వీటిలో ఎక్సైజ్‌ డ్యూటీ, సర్వీస్‌ ట్యాక్స్‌, వ్యాట్‌ లతో పాటు క్లీన్‌ ఎనర్జీ సెస్‌ అనే ట్యాక్స్‌ కూడా చెల్లిస్తుండేది. ఈ ట్యాక్స్‌ కింద టన్నుకు 400 రూపాయల చొప్పున కంపెనీ చెల్లిస్తుండేది. అయితే జూలై 1, 2017లో పలు రకాల టాక్సులన్నింటని కలిపి జి.ఎస్‌.టి. విధానాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎక్సైజ్‌ డ్యూటీ, సర్వీస్‌ టాక్స్‌, వ్యాట్‌ ను జి.ఎస్‌.టి.లో విలీనం చేయడం జరిగింది. ఈ ప్రకారం సింగరేణి సంస్థ జూలై 1, 2018 నుండి క్రమం తప్పకుండా జి.ఎస్‌.టి.లు చెల్లిస్తూ అత్యధిక జి.ఎస్‌.టి. చెల్లింపు దారుగా అవార్డును కూడా అందుకుంది.

అయితే కేంద్రం వారు పై టాక్సును జి.ఎస్‌.టి.లో విలీనం చేసినప్పటికీ క్లీన్‌ ఎనర్జీ సెస్‌ ను మాత్రం పేరు మార్పుతో జి.ఎస్‌.టి. కాంపెన్‌సేటరీ సెస్‌ అని కొనసాగించడానికి నిర్ణయించారు. పాత క్లీన్‌ ఎనర్జీ సెస్‌ కు మాదిరిగానే కొత్తగా పేరు మార్పుచేసి అములోకి తెచ్చిన జి.ఎస్‌.టి. కాంపేన్‌సేటరీ సెస్‌ పద్ధతిలో కూడా టన్ను బొగ్గుకు 400 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో జూన్‌ 30 వ తేదీన నాటికి సింగరేణి వద్ద స్టాకు రూపంలో ఉన్న, అనగా అమ్మకం జరగని దాదాపు 58 లక్షల టన్నుల బొగ్గును జూలై నెలలో విక్రయించింది. సింగరేణి యాజమాన్యం దీనికి సంబంధించిన కొత్త జి.ఎస్‌.టి. కాంపెన్‌సేటరీ సెస్‌ ను టన్నుకు 400 రూపాయల చొప్పున జూలై నెలలో చెల్లించింది. కాని కేంద్ర జి.ఎస్‌.టి. అధికారులు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోకుండా జూన్‌ నెల 30వ తేదీ నాటికి ఉత్పత్తి అయి స్టాకుగా ఉన్న 58 లక్షల టన్నుల బొగ్గుకు జి.ఎస్‌.టి. పూర్వం అమలులో ఉన్న క్లీన్‌ ఎనర్జీ సెస్‌ పథకం కింద టన్నుకు 400 రూపాయల చొప్పున టాక్సు చెల్లించాల్సిందేనని సింగరేణికి నోటీసు ఇవ్వడం జరిగింది. దీంతో సింగరేణి ఆర్ధిక శాఖ వారు ఆశ్చర్యపోయారు

జూన్‌ నెలలో స్టాకుగా ఉన్న బొగ్గు అమ్మినట్లు కాదని, స్టాకు బొగ్గును క్రమంగా తరువాతి నెలల్లో వినియోగదారులకు విక్రయిస్తుంటామని, అలాగే జూన్‌ నెల స్టాకును జూలై నెలలో విక్రయించామని, ఆ అమ్మకంపై టన్నుకు 400 రూపాయల కొత్త టాక్సును అనగా జి.ఎస్‌.టి. కాంపెన్‌సేటరీ ట్యాక్స్‌ను కూడా చెల్లించేశామని కనుక ఇదే బొగ్గుకు క్లీన్‌ ఎనర్జీ సెస్‌ చెల్లించాలని నోటీసులు ఇవ్వడం తగదని, నోటీసు ఉపసంహరించుకోవాలని గత రెండేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సమస్య ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదు.

కాగా ఆదివారం నాడు హైద్రాబాద్‌లో స్వయంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించిన నేపథ్యంలో దీనిని ఒక సదవకాశంగా సింగరేణి వినియోగించుకుంది. జి.ఎస్‌.టి. వారు ఇచ్చిన నోటీసు ప్రకారం తాము సెస్‌ చెల్లిస్తే ఒకే బొగ్గుకు రెండు సార్లు టాక్సు చెల్లింపు అనగా డబుల్‌ టాక్స్‌ చెల్లించినట్లు అవుతుందని, కనుక 236 కోట్ల రూపాయల పాత క్లీన్‌ ఎనర్జీ సెస్‌ ను చెల్లించాల్సిందే అంటు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని డైరెక్టర్‌ ఫైనాన్స్‌ శ్రీ ఎన్‌.బలరాం కేంద్ర మంత్రికి సదస్సులో వివరించారు. శ్రీ ఎన్‌.బలరాం వివరణను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకొన్న కార్యదర్శి (రెవిన్యూ) శ్రీ అజయ్‌ భూషన్‌ పాండే పూర్తి సానుకూలంగా స్పందించారు. నోటీసు ఉపసంహరణ కోసం ఒక నోటు సమర్పించమని కోరారు.

దీనిపై డైరెక్టర్‌ ఫైనాన్స్‌ శ్రీ ఎన్‌.బలరాం హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే నోటును సమర్పించారు. ఈ నోటీసు ఉపసంహరించుకొంటే సింగరేణికి సుమారు 236 కోట్ల రూపాయల అనవసర చెల్లింపు భారం నుండి విముక్తి కలుగుతుంది. ఈ సమావేశంలో సింగరేణి జి.ఎం. ఫైనాన్స్‌ & ఎకౌంట్స్‌ శ్రీ నర్సింహ్మారెడ్డి, పి.ఆర్‌.ఓ. శ్రీ బి.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -