కాళేశ్వరం ఆపే ప్రసక్తేలేదు:హైకోర్టు

339
ts high court
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగగా పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది న్యాయస్ధానం. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.

పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చునన్న సూచించిన న్యాయస్ధానం… పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన 60 మంది నిర్వాసితుల పరిహారాన్ని వారి లాయర్లకు అందజేయాల్సిందిగా ఆదేశించింది.

దశాబ్దాల తెలంగాణ ప్రజల దాహార్తిని తీరుస్తూ,గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ రైతుల జీవితాల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత కీలకమైన ఆరో ప్యాకేజీ నందిమేడారం భూగర్భంలో నిర్మించిన మూడో పంపు సెట్,నాలుగో పంపు సెట్ వెట్‌ రన్‌ను బుధవారం విజయవంతంగా ప్రారంభించారు అధికారులు. ఒక్కరోజే రెండు పంపుల వెట్ రన్ విజయవంతం కాడంపై అధికారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్ టన్నెల్‌లో నీటిని ఎత్తిపోసేందుకు ఏడు భారీమోటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏప్రిల్ 24,25 తేదీల్లో మొదటి,రెండో మోటార్‌ వెట్‌రన్‌ను అధికారులు సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించారు. జూన్ రెండో వారంలోగా మిగితా మూడు మోటార్ల వెట్‌ రన్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎల్లంపల్లి నుండి విడుదల చేసిన నీటితో నందిమేడారం సర్జ్‌పూల్‌(ప్యాకేజ్‌ 6) నిండుకుండను తలపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత కీలకంగా మారిన ఈ వెట్ రన్‌ కోసం అధికారులు నిరంతరంగా శ్రమించారు.

130 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు ఇక్కడినుండి నీటిని ఎత్తిపోయనున్నారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోనుంది.

1832 కిలోమీటర్ల పొడవునా,190 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోస్తూ 20 జిల్లాలకు ఉపయోగపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహత్తర కార్యంలో భాగంగా ఒకే రోజు రెండు వెట్ రన్‌లు సక్సెస్ కావడంతో యావత్ తెలంగాణ మురిసిపోతోంది.

- Advertisement -