ఆల్‌ పార్టీ మీటింగ్‌కు టీఆర్ఎస్‌ దూరం..కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా!

493
kcr federal front
- Advertisement -

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ అధికారంలోకి రాకుండ శతవిధాలుగా ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు అంటే ఈ నెల 21న ఆల్ పార్టీ మీటింగ్‌ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. రాహుల్‌తో భేటీ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ డేట్‌ను అనౌన్స్‌ చేసిన చంద్రబాబు 21 పార్టీలకు ఆహ్వానం పంపారు.

కేంద్రంలో ప్రాంతీయపార్టీల మద్దతే కీలకంగా ఉండేలా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఆల్ పార్టీ మీటింగ్‌లో చంద్రబాబు ముఖ్యపాత్ర పోషిస్తుండటంతో పాటు ఎన్నికల తర్వాతే కీలక నిర్ణయం వెలువరించడంలో భాగంగా కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు సమదూరం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో పాటు ఏపీలో వైఎస్ జగన్ మెరుగైన ఫలితాలు సాధించనుండటంతో ఎన్నికల తర్వాత వైసీపీతో కలిసి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదపనున్నట్లు సమాచారం. ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి లోక్ సభ స్ధానాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉంటే ఏపీ,తెలంగాణలో కలిపి ఎక్కువస్ధానాలు టీఆర్ఎస్,వైసీపీకి వచ్చే అవకాశం ఉండటంతో కేంద్రంలో చక్రం తిప్పేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్.

ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రాంతీయ పార్టీలే కీలకమని చెప్పిన ఆయన అందులో భాగంగా ఆయా పార్టీలన్నింటిని ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ వ్యుహరచన చేస్తున్నారని ఆయన చెప్పారు. మొత్తంగా రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ కామన్ మినిమిమ్ ప్రొగ్రామ్‌-కామన్ ఎజెండాతో ముందుకురానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -