ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం పోటాపోటి..!

133
mla quota mlc

ఓ వైపు స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుండగా మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్ధానాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు …మల్కాజ్‌గిరి నుండి ఎమ్మెల్యేగా గెలవడంతో తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో త్వరలోనే ఈ స్ధానానికి ఎన్నిక జరగనుండగా టీఆర్ఎస్ గెలుచుకోవడం లాంఛనమే. అయితే ఉన్నది ఒకే ఒక్క స్ధానం కానీ ఆశావాహుల సంఖ్య చాంతాడంత ఉండటంతో గులాబీ బాస్,సీఎం కేసీఆర్ ఎవరిని ఫైనల్‌ చేస్తారోనని సస్పెన్స్ నెలకొంది.

అయితే ప్రధానంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి,కె నవీన్ రావు పోటీ పడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన నవీన్‌ రావు టీఆర్ఎస్ నుండి ఎంపీ సీటు ఆశీంచారు. ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఎంపీ టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.దీంతో ఆయన టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు.

మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి తనకు ఖాయమనే ధీమాలో ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎన్నికల ప్రచారం సందర్భంగా త్వరలోనే గుత్తాకు పెద్ద పదవి(మంత్రి పదవి) రాబోతుందంటూ హింట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈనేపథ్యంలో నల్గొండ స్ధానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరు ఖరారే అని వార్తలు వెలువడ్డాయి. అయితే చివరినిమిషంలో తేరా చిన్నపరెడ్డికి టికెట్ ఇచ్చారు గులాబీ బాస్. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అందుకే పోటీ చేయలేదని ఆయన సన్నిహితులు తెలిపారు.ఆయన కూడా టికెట్ తనకే అన్న ధీమాలో ఉన్నారు.

ఇక వీరిద్దరితో పాటు టీఆర్ఎస్ నేతలు దండె విఠల్,తక్కలపల్లి రవీందర్ రావు,మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,మాజీ స్పీకర్ మధుసుదనాచారి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్సీ…పోటీపడే వారి సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండటంతో సీఎం కేసీఆర్ ఎవరి పేరు ప్రకటిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.