తెలంగాణ విద్యుత్ శాఖ…అరుదైన ఘనత

299
Telangana
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనేక అద్భుత విజయాలతో ముందుకు పోతున్న తెలంగాణ విద్యుత్ శాఖ మరో రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. అలాగే చరిత్రలో ఎన్నడూ లేనంతగా తలసరి విద్యుత్ వినియోగం నమోదైంది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినప్పటికీ ఎక్కడా ఏమాత్రం కోత, లోటు లేకుండా విద్యుత్ సంస్థలు విద్యుత్ సరఫరా చేయగలిగాయి. 23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది.

ఇప్పుడు కేవలం తెలంగాణలో మాత్రమే అంతకు మించి డిమాండ్ వచ్చింది. గత ఏడాది ఇదే రోజు తెలంగాణలో గరిష్ట డిమాండ్ 9,770 నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్ వచ్చింది. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, పరిశ్రమల సంఖ్య పెరగడం తదితర కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అధిక డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో 5,661 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన డిమాండ్ 132.6 శాతం అధికం.

దేశ సగటును మించిన విద్యుత్ వినియోగం..

తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ తో పాటు విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018-19 సంవత్సరంలో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం అధిక విద్యుత్ వినియోగం జరిగింది. ఇదే సమయంలో దేశ సగటు 23 శాతంగా మాత్రమే నమోదైంది. భారీగా పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం విశ్వవ్యాప్తంగా ప్రగతి సూచికలుగా (indicators) గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశ సగటును మించింది. దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 మెగావాట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,896 మెగావాట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 మెగావాట్లుంటే, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది.

డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణాలు..

తెలంగాణ వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక విధాన నిర్ణయాల వల్ల విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

-తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయానికి నాలుగైదు గంటలకు మించి సరఫరా అయ్యేది కాదు. కానీ తెలంగాణ వచ్చిన 9 నెలల వ్యవధిలోనే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించారు. 2018 జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2కు ముందు 2వేల మెగావాట్లకు మించి వ్యవసాయ డిమాండ్ రాకపోయేది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతలతో కలుపుకుని వ్యవసాయానికి 6వేల మెగావాట్ల వరకు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 19,02,754 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుంటే, నేడు రాష్ట్రంలో 24,31,056 కనెక్షన్లున్నాయి. 2014లో ఎత్తిపోతల పథకాలకు కేవలం 680 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ఫలితంగా పంపుహౌజుల నిర్వహణకు ప్రస్తుతం 2200 మెగావాట్ల వరకు విద్యుత్తు అవసరం అవుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది.

-టిఎస్ ఐపాస్ చట్టం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటి రంగాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తే, నేడు తెలంగాణలో పరిశ్రమలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. దాని కారణంగా కూడా తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది.

-వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండడం వల్ల వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు కూడా పెరిగాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల వృద్ధి రేటు అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం విద్యుత్ కనెక్షన్లు 1,11,19,990 ఉంటే, నేడు రాష్ట్రంలో 1,54,14,451 కనెక్షున్నాయి. తెలంగాణ వచ్చిన నాటితో పోలిస్తే 38.61 శాతం అధికంగా కనెక్షన్లున్నాయి.

కేసీఆర్ మార్గదర్శకం, సిబ్బంది కృషే కారణం: సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితి నేడు ఇంత గొప్పగా తయారు కావడం ఒక్కరోజులో జరిగిన అద్బుతం కాదని, దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకం, అనుక్షణం పర్యవేక్షణ, విద్యుత్ సంస్థల ఉద్యోగుల అవిరళ కృషి ఉన్నదని జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన డిమాండుకు మించి తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ ఏర్పడడం, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయగలగడం సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నది సిఎండి చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ రావడానికి, సమర్థ వంతంగా సరఫరా జరగడానికి ప్రణాళికా బద్ధంగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో తెచ్చిన మార్పులే కారణమన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదని, కానీ నేడు 16,246 మెగావాట్లు అందుబాటులో ఉందన్నారు. నాడు కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంటే, నేడు 3,650 మెగావాట్ల సోలార్ సామర్థ్యం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు 233 సబ్ స్టేషన్లుంటే, నేడు 347 సబ్ స్టేషన్లున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు, విద్యుత్ ఉద్యోగులకు అందిస్తున్న ప్రోత్సాహం, ఆర్థిక సహకారం వల్లనే ఈమార్పు సాధ్యమయిందన్నారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నిజం చేస్తామన్నారు.

- Advertisement -