గల్ఫ్ కు వెళ్లిన వారు తిరిగి వచ్చేయాలిః సీఎం కేసీఆర్

417
cm kcr
- Advertisement -

గల్ఫ్‌కు వెళ్లిన తెలంగాణ బిడ్డలకు సంబంధించి విషయంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో గల్ఫ్‌ దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని కోరారు.ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కుంటూ, గల్ఫ్ దేశాలకు పోయారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇంతా చేస్తే వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గతంలో లాగా లేదు. ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బిడ్డలు పనికోసం వేరే చోటకి వెళ్తే, తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని తిరిగి రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

వారికి నాక్ లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి నేనే అక్కడికి వెళతాను’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఎన్.ఆర్.ఐ. విధానం అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జిఎడి ముఖ్య కార్యదర్శి ఆధార్ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళ రాష్ట్రంలో పర్యటించనుంది. గల్ఫ్ దేశాల్లో పనికి పోయిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలోనే సిఎం సమావేశం కానున్నారు.

- Advertisement -