31 జిల్లాలు ఫైనల్‌…

209
- Advertisement -

ప్రతిపాదిత 31 జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా డిమాండును ప్రభుత్వం పరిశీలించబోదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎంపీ కే కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ వివిధ వర్గాలనుంచి సమాచారాన్ని సేకరించింది.తుది నివేదికను ఇవాళ ముఖ్యమంత్రికి అందజేయనుంది. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగానే ప్రభుత్వం అన్ని కోణాలనుంచి పరిశీలించి 31 జిల్లాల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నదని చెప్పారు. అంతకుమించి ప్రభుత్వం వద్ద డిమాండ్లు పెట్టడం సరికాదని హోం మంత్రికి సీఎం హితవు పలికారు.

కొత్తగా ఏర్పాటవుతున్న సిద్దిపేట, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కమిషనరేట్లతోపాటు 25 సబ్‌డివిజన్లు, 28 సర్కిళ్లు, 82 పోలీస్‌స్టేషన్లు అన్నీ కూడా దసరా రోజున ప్రారంభం కావాలని చెప్పారు. వీటిలో అవసరమైన కమిషనర్లు, డీసీపీలు, ఏసీపీలను నియమించాలని డీజీపీని ఆదేశించారు. దసరా రోజు ఆవిర్భవించనున్న కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు ఆమోదం తెలిపేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శుక్రవారం జరుగనుంది.శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలుపనున్నారని విశ్వసనీయ సమాచారం. దీంటోపాటే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు, 119 కొత్త మండలాల ఏర్పాటును కూడా కేబినెట్ ఆమోదించనున్నది. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తారు. ఇదే సమావేశంలో సిద్దిపేట, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కూడా ఆమోదం లభించనుంది.

జిల్లాల ప్రారంభ సూచికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జిల్లాను ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన చేస్తారు. ఒకే సమయంలో అన్ని జిల్లాలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. సీఎం కేసీఆర్‌ మెదక్‌, సిద్దిపేట జిల్లాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు పాల్గొంటారు. ఇక వరంగల్‌ రూరల్‌ జిల్లాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి‌, భూపాలపల్లి జిల్లాను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ జగిత్యాల, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్ జనగామ జిల్లాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా నాయిని యాదాద్రి, ఈటెల పెద్దపల్లి, పోచారం కామారెడ్డి, పద్మారావు మంచిర్యాల, మహేందర్‌రెడ్డి శంషాబాద్‌, కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలను ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్‌ను జోగు రామన్న, సూర్యాపేటను జగదీష్‌రెడ్డి, కొత్తగూడెంను తుమ్మల, నిర్మల్‌ను ఇంద్రకరణ్‌రెడ్డి, జోగులాంబ గద్వాల తలసాని, నాగర్‌కర్నూల్‌ను లక్ష్మారెడ్డి, వనపర్తి జిల్లాని జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. మల్కాజ్‌గిరి జిల్లాను సీఎస్‌ రాజీవ్‌శర్మ ప్రారంభిస్తారు.

CM_KCR

దేశవ్యాప్తంగా 125కోట్ల జనాభా ఉంటే 12,806 పోలీస్ స్టేషన్లున్నాయని చెప్పారు. ఇందులో ప్రతి 97వేల జనాభాకు ఒక పోలీస్‌స్టేషన్ ఉందని తెలిపారు. తెలంగాణ పునర్వ్యస్థీకరణలో మాత్రం 50వేల మందికి ఒక ఠాణా రాబోతున్నదని అన్నారు. తెలంగాణ జనాభా 3.60కోట్లు ఉంటే 709 పోలీస్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ విషయంలోనూ దేశ సగటుకంటే తెలంగాణ సగటు మెరుగ్గా ఉందని తెలిపారు.

CM_KCR

కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుతోనే సరిపోదని, అవి సమర్థంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ఏడాదిలోగా జిల్లా కార్యాలయాలతోపాటు మండల స్థాయి కార్యాలయాల నిర్మాణం కూడా పూర్తి కావాలన్నారు. కార్యాలయాల నిర్మాణం కోసం వచ్చే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.గద్వాల జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లాగా పేరు పెట్టాలని నిర్ణయించారు.

 

- Advertisement -