పారదర్శకతతో పెరిగిన టీఎస్‌ఎండీసీ ఆదాయం…

196
sheri subash reddy

ఇసుక పాలసీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు టీఎస్‌ఎండీసీ ఛైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి. మూడేళ్లలో రూ.500 కోట్ల‌ నుండి రూ. 2200 కోట్ల‌కు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఘనకీర్తి సాధించింది. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు శేరి సుభాష్‌ రెడ్డిని ఘనంగా సన్మానించారు.

2007 – 2008 నుండి 2013 – 2014 వ‌ర‌కు మైనింగ్‌ ద్వారా రూ.39.69 కోట్ల ఆదాయం రాగా 2014 – 2015 నుండి జులై 2015 – 2016 వ‌ర‌కు రూ.535.43 కోట్లు ఆదాయం ,2016 నుండి జులై 10,2019 వ‌ర‌కు రూ.2207.78 కోట్ల ఆదాయం వచ్చింది. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తెలంగాణ రాష్ట్ర ఖ‌నిజాభివృద్ది సంస్థ ఐఎస్ఓ 9001 – 2015 గుర్తింపు పొందిన సంస్థ‌గా అవ‌త‌రించింది.

తెలంగాణ మొత్తంలో ఇప్ప‌టి వ‌ర‌కు 80కి పైగా ఇసుక స్టాక్ యార్డులుండగా నాలుగేళ్ల‌లో 4 కోట్ల 30 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ఇసుక స‌ర‌ఫ‌రా చేశామని వెల్లడించారు సుభాష్ రెడ్డి. మంచిర్యాల జిల్లా దేవాపూర్ లో 797 హెక్టార్ల‌లో లైమ్ స్టోన్ గ‌నులు ఓరియంట్ సంస్థ‌కు లీజుకు ఇచ్చామని 2000 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన సంస్థ మూలంగా 4 వేల కుటుంబాల‌కు ఉపాధి – ప‌రోక్షంగా 20 వేల మందికి జీవ‌నోపాధి లభించిందన్నారు.

ఈ లీజు మూలంగా రాష్ట్ర ఖ‌నిజాభివృద్ది సంస్థ‌కు ఏడాదికి రూ.8.4 కోట్ల ఆదాయం రానుందన్నారు. తెలంగాణ‌లో ఆరు క్వారీలు లీజుకు తీసుకున్న తెలంగాణ ఖ‌నిజాభివృద్ది సంస్థ. దీనిలో ఒక్క‌ ఖ‌మ్మం జిల్లా వెంక‌టాపూర్ క్వారీ నుండి ఏడాదికి రూ.43 ల‌క్ష‌ల ఆదాయం వచ్చిందన్నారు. అభివృద్ది ద‌శ‌లో మిగిలిన ఐదు క్వారీలు ఉన్నాయని తెలిపారు.

త్వరలోనే ఆదాయం రావ‌డం మొద‌ల‌వుతుందని… జాతీయ ఖ‌నిజాన్వేష‌ణ ఏజెన్సీగా టీఎస్ఎండీసీని గుర్తించింది కేంద్ర ఖ‌నిజ మంత్రిత్వ‌శాఖ. ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల‌తో పాటు తెలంగాణ‌లో ఖ‌నిజాన్వేష‌ణ చేసేందుకు టీఎస్ఎండీసీకి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. టీఎస్ఎండీసీని జాతీయ ఖ‌నిజాన్వేష‌ణ సంస్థ‌గా గుర్తించిన త‌రువాత సూర్యాపేట‌, న‌ల్గొండ‌, వికారాబాద్ జిల్లాల‌లో సున్నపురాయి నిల్వ‌లు వెలికితీత‌కు రూ.29 కోట్లను జాతీయ ఖ‌నిజాన్వేష‌ణ సంస్థ కేటాయించింది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏడేళ్ల‌లో ఖ‌నిజాభివృద్ది సంస్థ ద్వారా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఆదాయం కేవ‌లం రూ.39.69 కోట్లు మాత్రమేనని సుభాష్ రెడ్డి చెప్పారు. ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుల్లో ఒక సంస్థ‌గా ఎదిగిన టీఎస్ఎండీసీ – ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన అవ‌కాశంతో ఖ‌నిజాభివృద్ది సంస్థ అభివృద్దికి కృషి చేశానని చెప్పారు. కేసీఆర్ ఆశీస్సుల‌ు, కేటీఆర్ సహకారంతో దేశంలోనే అత్యున్న‌త ప్ర‌మాణాలు క‌లిగిన ఖ‌నిజాభివృద్ది సంస్థ‌గా నిల‌ప‌గ‌లిగానని చెప్పారు.

తెలంగాణ ఖ‌నిజాభివృద్ది సంస్థ‌కు ఇత‌ర రాష్ట్రాల‌లో ఖ‌నిజాన్వేష‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం సంస్థ ప‌నితీరుకు నిద‌ర్శ‌నమని చెప్పారు. భ‌విష్య‌త్‌లో తెలంగాణ ఖ‌నిజాభివృద్ది సంస్థ‌ను దేశంలోని ఇత‌ర రాష్ట్రాల ఖ‌నిజాభివృద్ది సంస్థ‌ల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుపుతామని చెప్పారు.