పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాంః సీఎం కేసీఆర్

349
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ లను క్రియాశీలకంగా మారుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియామకమైన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన గటిక అజయ్ కుమార్ బుధవారం ప్రగతి భవన్ లో ఎంపిపిలు, జడ్పీటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్యమంత్రిని కలిశారు. తనను ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించినందుకు సిఎంకు అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అజయ్ కుమార్ కు సిఎం అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక ఆశించిన ఫలితాలు సాధించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు కూడా నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు అప్పగించడానికి కసరత్తు చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు. త్వరలోనే ఎంపిపిలు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, జడ్పీ చైర్మన్లతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించనున్నట్లు సిఎం చెప్పారు. ఆర్థిక సంఘం నిధులను ప్రతీ నెలా రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఇదే తరహాలో మండల, జిల్లా పరిషత్ లకు కూడా నిధులు విడుదల చేస్తామని సిఎం చెప్పారు. తెలంగాణ పల్లెలు దేశంలో కెల్లా ఆదర్శ గ్రామాలుగా మారాలన్నదే తన అభిమతమని సిఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రజల విస్తృత భాగస్వామ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నాయకత్వంలో పల్లెలు బాగు పడాలని సిఎం ఆకాంక్షించారు. దీనికి అవసరమైన ఆర్థిక ప్రేరణను ప్రభుత్వం అందిస్తుందని, మంచి విధానం తీసుకొస్తుందని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలు సమైక్యంగా ఉండి, గ్రామాలను బాగు చేసుకోవాలని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీటిసి సరోజ హరికిషన్ నాయక్, ఎంపిపి జాటోతు రమేశ్, టిఆర్ఎస్ నాయకులు కొమ్ము రమేశ్ యాదవ్, తాటిపల్లి శివకుమార్, సంపత్ రావు, శ్రీకాంత్, మూర్తి తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

- Advertisement -