అభివృద్ధిలో తెలంగాణ ముందంజ

383
soundarrajan

అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యభూమిక పోషిస్తానని చెప్పారు. గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రజలనుద్దేశించి మాట్లాడిన సౌందరరాజన్‌ ..తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆర్థికవృద్ధిని సాధించినందుకు గర్వంగా ఉందన్నారు.

రాజకీయాలకతీతంగా పార్టీలు కూడా రాష్ర్టాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. అన్నివర్గాల ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ ప్రభుత్వం అన్ని పండుగలకు ఒకే రకమైన ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. గంగాజమునా తెహజీబ్‌ను పూర్తి నిబద్ధతతో పరిరక్షిస్తున్నదని పేర్కొన్నారు. ఓ మనిషి సృష్టించిన అద్భుతం కాళేశ్వరం అని కొనియాడారు.

తెలుగు భాషను 14 రోజుల్లో నేర్చుకుంటానన్న నమ్మకముందన్నారు. ఇక్కడి ప్రజలతో స్థానిక భాషలోనే సంభాషించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తెలంగాణకు వచ్చేముందే, రాష్ట్ర సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేశానని తెలిపారు.

హరితహారం, విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి విభిన్నమైన పథకాలను లోపరహితంగా నిర్వహిస్తూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నదని గవర్నర్ పేర్కొన్నారు. రైతులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్నిరకాల సేవల్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కొనియాడారు.