తెలుగు రాష్ట్రాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శం..

352
KCR and Jagan
- Advertisement -

ఈ రోజు జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో భోజనానంతరం జరిగిన చర్చలోభాగంగా విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలన్నింటినీ సామరస్యంగా, చర్చలతో పరిష్కరించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. నేడు,రేపు ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్చలు జరుగుతాయి.ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన తదితర అంశాలపై చర్చిస్తారు.గోదావరి నీటిని తరలించే విషయంలో తగిన ప్రాతిపదికలు రూపొందించే బాధ్యతను రెండు రాష్ట్రాల అధికారులకు సంయుక్తంగా స్వీకరిస్తారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఇఎన్సీల ఆధ్వర్యంలో ఈ పని జరుగుతుంది. జూలై 15లోగా అధికారులు ముఖ్యమంత్రులకు నివేదిక ఇస్తారు.ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు.

KCR

సీఎం కేసీఆర్.. సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశం గొప్ప ప్రారంభమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విభజన సందర్భంగా తలెత్తిన అన్ని సమస్యలను సామరస్య పూర్వకంగా, సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గచాలనం అవసరం లేదని, కరచాలనం కావాలన్నారు. కత్తులు దూసేది లేదని, చేతులు కలపాలని చెప్పారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించాలనేది తమ విధానమని, అదే విధానంతో మహారాష్ట్రతో వ్యవహరించి ఫలితం సాధించామన్నారు. తెలంగాణ, ఎపి కూడా అలాగే వ్యవహరించి రెండు రాష్ట్రాలకు మేలు కలిగే విధంగా వ్యవహరిస్తాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేసి, ప్రజలకు ఫలితాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులకు సూచించారు.

ఏపీ సీఎం జగన్.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో, నీటి పారుదల రంగం విషయంలో కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, ఇద్దరం ఒకటేననే భావన కలిగి ఉండాలని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యే విషయంలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, కానీ రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలను రెండు రాష్ట్రాల్లోని సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో ఉత్తమమని తాను భావించానని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ఎవరో పరిష్కరించడం కంటే, ఈ రెండురాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. రెండు రాష్ట్రాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

- Advertisement -