టీడీపీకి హ్యాండ్ ఇవ్వనున్న సీమ నేతలు!

237
chandrababu

త్వరలో టీడీపీకి మరో షాక్ తగలనుందా..?రాయలసీమ టీడీపీ నేతలు పార్టీ మారాలని డిసైడయ్యారా..?వీరికోసం బీజేపీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసింది…?చంద్రబాబుకు హ్యాండ్ ఇవ్వనున్న సీమ టీడీపీ నతలు ఎవరనేదానిపై ఇప్పుడు ఆ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సునామీ టీడీపీ హేమాహేమీలు మట్టికరిచారు. ముఖ్యంగా పార్టీకి గట్టిపట్టున్న అనంతపూర్‌,కర్నూల్‌ లాంటి జిల్లాల్లో సైతం టీడీపీ మట్టికరిచింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 23 స్ధానాలకే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్‌ ఏంటనే దానిపై సీమ నేతలు ఆందోళన చెందుతున్నారు.

తమ రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారని సమాచారం. త్వరలోనే వీరు కమలం గూటికి చేరనున్నారని సమాచారం. ఢిల్లీలో ఉన్న బీజేపీ కీలక నేతల్ని నిరంతరం సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు నేతలు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

పరిటాల సునీత కుటుంబం, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, వరదాపురం సూరి పేర్లు అనంతపురం జిల్లా నుంచి వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి కుటుంబం కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

వీరి చేరిక ద్వారా ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అయితే తమ నేతలు బీజేపీ గూటికి చేరకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు. మొత్తంగా ఆపరేషన్ కమలంలో భాగంగా బీజేపీ నేతలు వేస్తున్న స్కెచ్‌ ఎంతవరకు సత్ఫలితానిస్తుందో వేచిచూడాలి.