ఏపీ స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక

397
tammineni sitaram
- Advertisement -

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. స్పీకర్‌గా తమ్మినేని ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు అసెంబ్లీ అధికారులు. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎంపికకు ప్రతిపక్ష టీడీపీ కూడా మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

స్పీకర్ పదవికి బుధవారం సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని సీతారాం ఒక్కరే నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్‌ను బలపరుస్తూ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు 30 మంది వరకు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అనంతరం శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

బీసీ(కళింగ) సామాజిక వర్గానికి చెందిన సీతారం 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా సీతారాం సేవలందించారు.

- Advertisement -