మహిళా భద్రతపై కళాశాలల్లో ప్రత్యేక కమిటీలు

530
swathi Lakra
- Advertisement -

మహిళలు, బాలికల భద్రతకై పోలీస్ శాఖ చేపట్టిన చర్యలపై మరింత భరోసా కల్పించేలా రాష్ట్రం లోని అన్ని కళాశాలల్లో విద్యార్దినులచే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజి స్వాతి లక్రా తెలియచేసారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా భద్రతా విభాగం చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ దాదాపు 78 మంది కవయిత్రులు రాసిన కవితా సంపుటి ” హితైషి” పుస్తకావిష్కరణ, షీ- టీమ్ లపై ప్రభుత్వ గ్రూప్ వన్ అధికారిని శ్రీ వల్లి రూపొందించిన వీడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం సికిందరాబాద్ కస్తూర్బా మహిళా కళాశాలలో నేడుజరిగింది. ఐ జీ స్వాతి లక్రా ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమానికి ఎస్పీ సుమతి, ఎన్ సి సి కామాండింగ్ అధికారి రామానంద సింగ్, ప్రముఖ రచయిత్రి షీలా సుభద్రాదేవి, తరుణీ స్వంచ్ఛంద సంస్థ మమతా రఘువీర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఐ జీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా భద్రతకు చేపట్టిన షీ టీమ్, భరోసా, హాక్ -ఐ ల గురించి విద్యార్థినులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి వుండాలని అన్నారు. అన్నిప్రాంతాలకు పోలీసింగ్ వ్యవస్థ చేరుకోలేదని, ఇందుకుగాను ప్రతీ కళాశాలలో షీ వలంటీర్ల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమను ఎవరు వేధించినా, మీ ఇంటి ప్రక్కన వుండే మహిళను గాని, స్నేహితులను ఎవరు వేధించినా వెంటనే షీ టీమ్ లను సంప్రదించాలని, హాక్ -ఐ ఆప్ ను ఉపయోగించేలా చైతన్య వంతం చేయాలని సూచించారు. తమ కాలనీలు, ప్రధాన కూడళ్లలో పోకిరీలు, ఆకతాయిలపై సమాచారాన్ని పోలీసులకు, షీ టీమ్ లకు సమాచారం అందించాలని కోరారు.

షీ టీమ్ లు మీ కోసం వున్నాయనే భరోసాను మహిళలందరిలో కల్పించాలని విద్యార్థినులకు సూచించారు. ఎస్ పీ సుమతి మాట్లాడుతూ, మహిళల భద్రతపై చైతన్యం లో భాగం గా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో 78 కవయిత్రులతో కవితా సంపుటిని వెలువరించినట్టు తెలిపారు.

తరుణీ స్వచ్చంద సంస్థ ప్రతినిధి మమతా రఘువీర్ మాట్లాడుతూ.. తెలంగాణాలో స్వాతంత్రానంతరం 12 మిలియన్ల బాల్య వివాహాలు జరిగాయని అన్నారు. బాలికలు, మహిళలతో ఇప్పటికీ పోషకాహార లోపం, ఆరోగ్య పరమైన సమస్యలు, వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రముఖ రచయిత్రి షీలా సుభద్రాదేవి మాట్లాడుతూ సమాజంలోని మహిళలో సరికొత్త ఆత్మా స్తైర్యం షీ టీమ్ ల ద్వారా వచ్చిందని అన్నారు. ఈ సందర్బంగా మహిళల భద్రతపై కళాశాల విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

- Advertisement -