సింగరేణి..తెలంగాణ కొంగు బంగారం

232
Singareni is pride of Telangana
- Advertisement -

సింగరేణి సంస్థ తెలంగాణకే తలమానికమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన సీఎం….సమైక్య రాష్ట్రంలో పాలకులు అన్నివిధాలా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సింగరేణితో పాటు ఆర్టీసీ,ఎలక్ట్రిసిటీ బోర్డులు పెద్ద సంస్థలని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు.

గతంలో సింగరేణి కార్మికులు ప్రమాదంలో చనిపోతే లక్ష రూపాయలు కూడా ఇచ్చేవారు కారని…కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ.36 లక్షలు ఇవ్వటంతో పాటు డిపెండెంట్‌ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. సింగరేణి…తెలంగాణ కొంగుబంగారమని స్పష్టం చేశారు. పాత అండర్ గ్రౌండ్ మైన్స్‌ మూసేస్తారని ప్రచారం జరుగుతోందని…అవన్ని పుకార్లే అన్నారు. పాత అండర్ గ్రౌండ్ మైన్స్‌ ను కొనసాగిస్తునే 11 కొత్త అండర్ గ్రౌండ్ మైన్స్‌లను ప్రారంభిస్తామని సభకు తెలిపారు. సింగరేణిలో కార్మికులంతా తెలంగాణ వారు….అధికారులంతా ఆంధ్రావాళ్లన్నారు.

సింగరేణిలో కొత్తగా 11,600 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 500 పడకల ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజీ మంజూరు కోసం కృషిచేస్తానన్నారు. ఉద్యోగ వనరుగా సింగరేణి ఉండాలంటే ఓపెన్ కాస్ట్ గనులు అవసరమని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గత పాలకులు సింగరేణి వైభవాన్ని కూలదోశారని మండిపడ్డారు.

గతంలో సింగరేణిలో కుంభకోణాలకు పాల్పడింది వాస్తవమేనని…అలాంటి వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇకపై సింగరేణిలో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో మొత్తం 56,866 మంది కార్మికులున్నారని సీఎం తెలిపారు. వాటిలో భూగర్భగనుల్లో 34,764 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఓపెన్‌కాస్ట్ గనుల్లో 10,427 మంది కార్మికులున్నారని తెలిపారు. వచ్చే ఏడాది 20 భూగర్భగనులు, 11 ఓపెన్‌కాస్ట్ గనులను ప్రారంభిస్తున్నాం. తద్వారా కొత్తగా 11, 621 మందికి ఉద్యోగాలు వస్తయని సీఎం వెల్లడించారు. భూగర్భగనుల వల్ల ఆర్థికంగా నష్టం వస్తుంది. భూగర్భగనుల వల్ల నష్టం వస్తున్నా కార్మికులను నడిపిస్తున్నం. ఓపెన్ కాస్ట్ గనుల వల్ల లాభాలు వస్తున్నాయి. ఓపెన్‌ కాస్ట్‌లేకపోతే సింగరేణి నిలదొక్కుకోలేదని పేర్కొన్నారు.

- Advertisement -