హుజుర్‌నగర్‌..కారెక్కిన సీపీఎం,కాంగ్రెస్ నేతలు

418
Minister Jagadish Reddy
- Advertisement -

గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకీ ఊహించని షాక్ తగిలింది. మరో 48 గంటల వ్యవధిలో ఉపఎన్నికలు జరుగనున్న నేపద్యంలో ఈ పరిణామం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో విపక్ష కాంగ్రెస్ నుండి వార్డు సభ్యులుగా విజయం సాధించిన అయిదుగురు వార్డు సభ్యులు,వారి వారి అనుచరులతో సహా టిఆరఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

పార్టీలో చేరిన వారిలో తండు అంజయ్య, చలికంటి నాగయ్య, షేక్ గులామ్, గుర్రాల సైదులు,పెండెం సైదులు ఉన్నారు.వీరితో పాటే నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన సీనియర్ నేత శానం వెంకటేష్ అదే గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కరణం సత్యంలు గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Minister Jagadish Reddy

వివిధ పార్టీల నేతలు టిఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే గులాబీ గూటికి బారులు కడుతున్నారన్నారు. నానాటికి అంతరించి పోతున్న కాంగ్రెస్ ఇప్పటికే కనుమరుగై పోయిన కమ్యూనిస్టు పార్టీలతో ప్రయోజనం లేదనుకున్న వివిధ పార్టీల లీడర్,క్యాడర్ టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు.

హుజూర్‌నగర్ నుండి 20 ఏండ్లుగా శాసనసభ్యులుగా ఉండడంతో పాటు మంత్రి పదవిలో ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆయన పిసిసినేత ఉత్తమ్‌పై విరుచుకుపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రోజునే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక పోయిన ఉత్తమ్ దంపతులు ఇప్పుడు హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి మరోసారి లబ్ది పొందాలని చూస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.

Minister Jagadish Reddy

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కు వరుసగా ఏడూ సంవత్సరాలు నీరు వదలకుండా కుడి కాలువకు నీళ్లు వదిలిన రోజున అధికారంలో ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అదే పరిస్థితులు ఉత్పన్నమైతే ఖమ్మం పట్టణానికి మంచినీటి పేరుతో ఎడమ కాలువ రైతాంగాన్ని కాపాడుకున్న అంశాన్ని ఎడమకాలువ రైతాంగం గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు .ఎన్ని జిమ్మిక్కు లు చేసిన రేపటి ఉప ఎన్నికలలో హుజూర్‌నగర్‌లో గులాబీ జెండానే ఎగురుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

- Advertisement -