గ్రేట‌ర్‌లో 81శాతం పూడిక ప‌నులు పూర్తి – దాన‌కిషోర్‌

196
dana kishore

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన 800 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో చేప‌ట్టిన నాలాల పూడికతీత ప‌నులు 81శాతానికి పైగా పూర్తి అయ్యాయ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ వెల్ల‌డించారు. న‌గ‌రంలో నాలాల పూడిక ప‌నులు, రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, క్యాచ్‌పిట్‌లు, మ్యాన్‌హోళ్ల మ‌ర‌మ్మ‌తులు త‌దిత‌ర అంశాల‌పై జీహెచ్ఎంసీ నిర్వ‌హ‌ణ విభాగం ఇంజ‌నీర్ల‌తో స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, సూప‌రింటెండెంట్, ఎగ్జీక్యూటీవ్ ఇంజనీర్లు పాల్గొన్న ఈ స‌మీక్ష స‌మావేశంలో క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 4,82,936 క్యూబిక్ మీట‌ర్ల పూడిక మ‌ట్టిని తొల‌గించాల్సి ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 3,93,341 క్యూబిక్ మీట‌ర్ల పూడిక ప‌నుల‌ను పూర్తిచేసిన‌ట్టు వివ‌రించారు. గ‌త సంవ‌త్స‌రం ఇదే రోజు కేవ‌లం 70శాతం పూడిక ప‌నులు పూర్తికాగా, ప్ర‌స్తుత సంవ‌త్స‌రం నేటికి 81.50 శాతం పూడిక ప‌నులు పూర్త‌య్యాయ‌ని విశ్లేషించారు. మిగిలిన పూడిక‌ప‌నుల‌న్నింటిని వారం రోజుల్లోగా పూర్తిచేయాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను దాన‌కిషోర్ ఆదేశించారు.

న‌గ‌రంలో రూ. 38.24 కోట్ల వ్యయంతో మొత్తం 327 పూడిక ప‌నుల ద్వారా 800.95 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ప‌నులు చేప‌ట్ట‌గా 640 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో పూడిక ప‌నులు పూర్తయ్యాయ‌ని అన్నారు. ఈ మొత్తం 327 ప‌నుల్లో 214 ప‌నులు మ్యాన్వ‌ల్‌గా, 113 ప‌నులు మిష‌న‌రీతో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. మ‌రో వారం రోజుల్లోగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలుపుతున్నందున ఈ వారంలోపు మిగిలిన పూడిక ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. పూడిక తీసిన మ‌ట్టిని వెంట‌నే డంపింగ్‌యార్డ్‌కు త‌ర‌లించాల‌ని అన్నారు.

ఈ ప‌నుల పురోగ‌తిపై స్థానిక శాస‌న స‌భ్యులు, కార్పొరేట‌ర్లకు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందించ‌డంతో పాటు వారికి ప్ర‌త్య‌క్షంగా చూపించాల‌ని క‌మిష‌న‌ర్ అన్నారు. నాలాల ప‌నుల‌కు సంబంధించి టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్త‌య్యిందని, ప‌నులు మంద‌కోడిగా సాగుతున్న ప్రాంతంలో అద‌న‌పు లేబ‌ర్‌, మిష‌న‌రీని నియ‌మించి వేగ‌వంతంగా పూర్తిచేయాల‌ని ఆదేశించారు. నాలా పూడిక ప‌నుల సంద‌ర్భంగా సామాజిక త‌నిఖీలను విధిగా నిర్వ‌హించాల‌ని, ఈ విష‌యంలో ఏవిధ‌మైన అవ‌క‌త‌వ‌క‌ల‌కు తావు ఇవ్వ‌వ‌ద్ద‌ని అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో అధిక శాతం నాలాలు మ్యాన్‌వ‌ల్‌గా పూడికతీత‌కు అనువుగా లేనందున యంత్రాల ద్వారా పూడిక‌తీసే ప‌నుల‌ను రానున్న రోజుల్లో చేప‌డుతామ‌ని పేర్కొన్నారు.

కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో 90శాతం పూడిక ప‌నుల పూర్తి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఆరు జోన్‌ల‌లో 90శాతం పూడిక ప‌నులు పూర్తి చేయ‌డం ద్వారా కూక‌ట్‌ప‌ల్లి జోన్ అగ్ర‌స్థానంలో నిలిచింది. కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో మొత్తం 91817.94 క్యూబిక్ మీట‌ర్ల పూడిక ప‌నుల‌కుగాను 82555.27 (90శాతం) క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గించ‌డం జ‌రిగింది. శేరిలింగంప‌ల్లి జోన్‌లో 63961.92 క్యూబిక్ మీట‌ర్ల‌కుగాను 56505.89 (89శాతం) క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గించారు. చార్మినార్ జోన్‌లో 127664 క్యూబిక్ మీట‌ర్ల‌కుగాను 109255 (85.60శాతం) పూడిక ప‌నులు పూర్తి అయ్యాయి. ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో 56524.43 క్యూబిక్ మీట‌ర్ల‌కుగాను 48080.71 (85.06 శాతం) పూడిక ప‌నులు పూర్తి అయ్యాయి. ఖైర‌తాబాద్ జోన్‌లో 83316.40 క్యూబిక్ మీట‌ర్ల‌కుగాను 64179.62(73.50 శాతం) పూడిక‌ను తొల‌గించ‌గా, సికింద్రాబాద్ జోన్‌లో 55650.67 క్యూబిక్ మీట‌ర్ల‌కుగాను 32764.67(58.88శాతం) పూడిక‌ను తొల‌గించిన‌ట్టు ఇంజ‌నీరింగ్ అధికారులు వివ‌రించారు. మిగిలిన ప‌నుల‌న్నింటిని వారం రోజుల్లోగా ఎట్టిప‌రిస్థితుల్లోనూ పూర్తిచేయాల‌ని, ఇందుకుగాను అద‌నపు లేబ‌ర్‌, మిష‌న‌రీని ఏర్పాటు చేసుకోవాల‌ని దాన‌కిషోర్ ఆదేశించారు.