ఆరు గంట‌ల్లో అద్భుతం చేశారు..!

273
Rub Ready
- Advertisement -

అసలే రైలు మార్గం. రైళ్లను ఆపి, అండర్ బ్రిడ్జిలు కట్టాలంటే ఒకప్పుడు రోజులు పట్టేది. కానీ ఇది హైటెక్ యుగం కదా! అంతా రెడీమేడ్! గంటల్లోనే పూర్తవుతున్నాయి. ఇక అస‌లు విష‌యానికొస్తే.. రైల్వేశాఖ‌ ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ఓ ప్రాజెక్టును అనూహ్యంగా ఆరు గంటల్లోనే పూర్తి చేసి అద్భుతాన్ని ఆవిష్క‌రించారు.

రైల్వే శాఖ తాజాగా అనుమతి ఇవ్వడంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా రైల్వే అధికారులు పనులు పూర్తి చేశారు.. ఇందుకు గ‌త‌ శనివారం అర్ధరాత్రి ముహూర్తం ఖరారు చేశారు. ఆదివారం తెల్లవారుజాము వరకు ఆర్‌యూబీ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

ఇంతకీ ఈ నిర్మాణం ఎక్కడో తెలుసా? బేగంపేట్‌–అమీర్‌పేట్‌ మధ్య. ఈ ఆర్‌యూబీ నిర్మాణం పూర్తయితే బేగంపేట్‌ వైపున్న ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి అమీర్‌పేట్‌ వైపున్న లీలానగర్‌కు కాలినడకన ఒకే ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు. అంతేకాకుండా దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆర్‌యూబీ కేవలం పాదచారులకు మాత్రమే. దీని ద్వారా వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. సిటీలోనే తొలిసారి నిర్మిత‌మైన‌ ఆర్‌యూబీ బిడ్జ్రి ఇదీ.

ప్రాజెక్టు పనులు ఇలా పూర్తి చేశారు..

గ‌త శనివారం రాత్రి ఎంఎంటీఎస్‌ రైళ్ల టైమ్ అయిపోయాక‌ అన్ని దూర ప్రాంత సర్వీసులు నగరాన్ని దాటిన త‌ర్వ‌త‌.. అంటే దాదాపు రాత్రి 11:30గంటల ప్రాంతంలో పనులు ప్రారంభించారు. ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి లీలానగర్‌ మధ్యలో ఉన్న రైలు పట్టాలను కట్ చేసి ఆ తర్వాత జేసీబీలు, క్రేన్ల సహాయంతో రైలు కట్టను మొత్తం తవ్వి… ఆ ప్రాంతంలో ముందుగానే సిద్ధంగా ఉంచిన బ్లాకులను అమర్చారు. దీంతో బేగంపేట్‌–అమీర్‌పేట్‌ల మధ్య పట్టాల కింది నుంచి దారి ఏర్పడింది. తిరిగి వెంటనే బ్లాకుల మీదుగా రైలు పట్టాలను పునరుద్ధరించి.. తెల్లవారుజాము వరకు పనులు పూర్తి చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

అయితే 2017 అక్టోబర్‌ 19న అప్పటి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అనంతరం ఆర్‌బీయూ నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.2.18 కోట్లను మంత్రి జీహెచ్‌ఎంసీ నుంచి మంజూరు చేయించి రైల్వే శాఖకు అందజేశారు. అయితే రైల్వే శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ఆర్‌యూబీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు మంత్రి తలసాని ఒత్తిడితో అనుమతులు రావడంతో పనులు పూర్తి చేశారు అధికారులు.

ఈ బ్రిడ్జి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం…

రైల్వే పట్టాల మీది నుంచి కాకుండా ఓల్డ్‌ కస్టమ్స్‌ నుంచి లీలానగర్‌కు వెళ్లాలంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. బేగంపేట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కట్టమైసమ్మ ఆలయం, హెచ్‌పీఎస్‌ నుంచి మయూరిమార్గ్‌ వరకు వెళ్లి తిరిగి బేగంపేట్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట ప్రాంతాలకు రావాల్సి ఉంటుంది. అలా కాకుండా రైలు పట్టాలు దాటితే ఒక్క నిమిషంలోనే లీలానగర్‌కు చేరుకోవచ్చు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురైనవారు ఎందరో ఉన్నారు. దీంతో స్థానికుల అభ్యర్థన మేరకు ఇక్కడ ఆర్‌యూబీ నిర్మాణాన్ని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయించారు

- Advertisement -