మహి ఫామ్‌లోకి వచ్చాడు…

263
RPS to Six-Wicket Win Over SRH
RPS to Six-Wicket Win Over SRH
- Advertisement -

నాయకత్వ భాద్యతల నుంచి తప్పించి.. బ్యాట్స్‌మన్‌గా తన సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నవారికి మహేంద్ర సింగ్‌ ధోనీ గట్టి సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్‌-10లో ఐదు మ్యాచ్‌లాడినా అతడి ముద్రే లేదు. అసలు ధోనీకేమైందని అభిమానుల వేదన. అతడి పనైపోయిందని విమర్శకుల వాదన. ఐతే తన ఫామ్‌పై చర్చ నేపథ్యంలో మహేంద్ర సింగ్‌ ధోని ఎట్టకేలకు జూలు విదిల్చాడు. హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌పై ఆచితూచి ఆడినా.. ఆఖర్లో ఉగ్రరూపం దాల్చాడు. ఆఖరి బంతి వరకూ నువ్వా.. నేనా అన్నట్టు సాగిన పోరులో 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 61 పరుగులు చేసి పుణెను గెలిపించాడు. ధోనీ దెబ్బకు పుణె లీగ్‌లో వరుసగా రెండో విజయం దక్కించుకుంది. హెన్రిక్స్‌ మెరుపు అర్ధ శతకంతో మంచి స్కోరు చేసినా.. రషీద్‌ ఖాన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా ఆఖర్లో పట్టు కోల్పోయిన రైజర్స్‌ మూడో ఓటమిని మూటగట్టుకుంది.

మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 176 పరుగులు చేసిం ది. మోసీ హెన్రిక్స్‌ (28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 నాటౌట్‌) మెరుపు అర్ధ శతకంతో విజృంభించాడు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 43), శిఖర్‌ ధవన్‌ (30), కేన్‌ విలియమ్సన్‌ (21) ఫర్వాలేదనిపించారు.

177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పుణె ఆరంభంలోనే ఓపెనర్‌ అజింక్యా రహానె (2) వికెట్‌ కోల్పోయింది. మొదటి ఓవర్లో భువీ ఒక్క పరుగే ఇవ్వగా.. నాలుగో ఓవర్లో రహానెను అవుట్‌ చేసి బిపుల్‌ పుణెను దెబ్బకొట్టాడు. కానీ, భారీ షాట్లతో విరుచుకుపడుతున్న మరో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పుణె 10 ఓవర్లకు 83/1తో నిలిచింది.

స్మిత్‌ (27; 21 బంతుల్లో 1×4, 2×6) 11వ ఓవర్లో ఔటయ్యాక పరిస్థితి మారిపోయింది. క్రీజులోకి వచ్చిన ధోని గత మ్యాచ్‌ల్లో పరుగుల కోసం కష్టపడ్డాడు. మరోవైపు త్రిపాఠి కూడా ఔట్‌ కావడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 15 ఓవర్లకు స్కోరు 115/3 కాగా.. ధోని 15 బంతుల్లో 17 పరుగులతో ఉన్నాడు. అప్పటికి పుణె గెలవాలంటే 30 బంతుల్లో 62 పరుగులు చేయాలి. తీవ్ర ఒత్తిడిలో మహీ ఒక్కసారిగా గేరు మార్చాడు. తన మార్కు షాట్లతో విజృంభించాడు. తర్వాతి ఏడు బంతుల్లో 6, 4, 1, 4, 4, 6తో రెచ్చిపోయి 25 రన్స్‌ రాబట్టిన మహీ మ్యాచ్‌ను తమవైపు లాక్కున్నాడు. ఈ క్రమంలో అతను 29 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరంకాగా.. తొలి బంతికి మనోజ్‌ తివారి బౌండరీ కొట్టాడు. కౌల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తర్వాతి నాలుగు బంతుల్లో 1, 1, 1, 2 మాత్రమే వచ్చాయి. ఉత్కంఠ తార స్థాయికి చేరింది. ఐతే ధోని ఎక్స్‌ట్రా కవర్‌లో బౌండరీ బాది ఉత్తమ ఫినిషర్‌గా తనకున్న పేరును నిలబెట్టుకున్నాడు. తన పనైపోలేదని మరోసారి నిరూపించుకున్నాడు..

- Advertisement -