రోబోటిక్ యంత్రాలతో పూడికతీత పనులు:బొంతు రామ్మోహన్

481
Ghmc Robo
- Advertisement -

హైదరాబాద్ నగరంలో మ్యాన్ హోల్స్ లోంచి చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రాన్ని హైటెక్ సిటీ లో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. నగరంలో మొదటిసారిగా హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు మేయర్ తెలిపారు.

గతంలో మ్యాన్ హోల్స్ లో చెత్తతీసే పనుల్లో దురదృష్టవశాత్తు పలువురు సఫాయి కార్మికులు మరణించారని అన్నారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా ఉండేందుకు…సరి కొత్త టెక్నాలజీ తో రోబోటిక్ యంత్రం ద్వారా పూడిక తీత పనులు చేస్తున్నామన్నారు.

అత్యంత క్లిష్టమైన పని మ్యాన్‌హోల్‌లోకి దిగి పూడికలు తొలగించడం.. లోపలున్న విష వాయువులతో ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటువంటి సమస్యలేవీ లేకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు రహేజా సంస్థ సహకారంతో బాండికూట్‌ రోబోను ప్రవేశపెడుతున్నారు. ఈ మరమనిషిని మంత్రి కేటీఆర్‌ మంగళవారం మాదాపూర్‌ 100 అడుగుల రోడ్డులో ప్రారంభించనున్నారు. 24 అడుగుల లోతు నుంచి సైతం పూడికలు తొలగించేస్తుంది. మ్యాన్‌హోల్‌ మూత తీసి దానిలోకి రోబోటిక్‌ లెగ్స్‌.. వాటిని పట్టి ఉంచే ఆర్మ్స్‌ను దించుతారు. లోనికి వెళ్లాక చక్రాలతో ఉండే కాళ్లు విచ్చుకుంటాయి. చేతులు పూడికలు సేకరించి వాటికి అనుసంధానించి ఉండే బకెట్‌లో వేస్తాయి. ఆ వ్యర్థాలను న్యూమాటిక్‌ లైన్‌ ఎయిర్‌ పవర్‌ సహాయంతో పైపుల ద్వారా పీల్చి పైన ఉండే మరో పాత్రలోకి సేకరిస్తారు.

​నాలుగు కెమెరాలతో.. ఈ మరమనిషికి 4 కెమెరాలు ఉంటాయి. రోబోటిక్‌ లెగ్స్‌, ఆర్మ్స్‌, యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ డిస్‌ప్లేకు అనుసంధానించి ఉంటాయి. ఆ తెరపై చూస్తూ ఆపరేటర్‌ రోబోను పని చేయిస్తారు. ఇతనికి ఓ సహాయకుడు ఉంటారని జెన్‌ రోబోటిక్స్‌ ప్రతినిధులు తెలిపారు. విద్యుత్తుతో నడిచే ఈ రోబో నిర్వహణకు 3 కేవీ జనరేటర్‌ను వాడతారు. యంత్రం ఒక్కసారిగా 60 లీటర్ల వ్యర్థాలు తొలగిస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేక పరికరాల వల్ల రాళ్ల వంటి ఘన వ్యర్థాలు ముక్కలవుతాయి. పని అయిపోయాక యూఐ డిస్‌ప్లేను మూసి చక్రాల సహాయంతో తీసుకెళ్లిపోవచ్చు.

ఇక ప్రత్యేక లైటింగ్‌ వ్యవస్థ ఉండడంతో రాత్రి పూట కూడా పూడికలు తొలగించొచ్చు. ముఖ్యంగా మ్యాన్‌హోల్స్‌లోని మీథేన్‌, అమ్మోనియా, కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి విషవాయువులను రోబో సెన్సర్ల ద్వారా పసిగట్టి, తెరపై వాటి పరిమాణాన్ని చూపించి అలారం మోగిస్తుంది. రోబో ధర రూ.32 లక్షలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హరియాణా, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌లలో వీటిని వినియోగిస్తున్నారన్నారు. కార్మికులే మ్యాన్‌హోల్‌లోకి దిగి పూడికలు తీయడం వల్ల విషవాయువులు ఉక్కిరిబిక్కిరి చేసి మూడేళ్ల క్రితం మాదాపూర్‌ 100 అడుగుల రోడ్డు ప్రాంతంలో ముగ్గురు కూలీలు, వారిని రక్షించే క్రమంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు షేక్‌పేట ఎర్రకుంట తటాకం సమీపంలోనూ ఇదే పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రోబోల వల్ల ఇలాంటి ఘటనలకు ఇక ఆస్కారముండదు.

​నగరంలో తొలిసారి.. నగరంలో తొలి బాండికూట్‌ రోబోను తమ జోన్‌లో వినియోగించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పశ్చిమ మండల జోనల్‌ కమిషనర్‌ హరిచందన తెలిపారు. నెల రోజులు దాని పనితీరును పరిశీలించి మరిన్ని రోబోలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు.

- Advertisement -