జియోకు వినియోగదారుల షాక్‌..!

417
jio
- Advertisement -

ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియోకు భారీగా షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఉచిత సేవలతో టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేసిన ఈ కంపెనీకి ఇప్పుడు కస్టమర్లు ఝలక్ ఇచ్చారు. టారిఫ్‌‌లు సవరిస్తూ కస్టమర్లకు షాకిచ్చిన రిలయన్స్‌కు ఇప్పుడు సబ్‌స్క్రైబర్ల నుంచి భారీ పంచ్ పడింది. డిసెంబరు నెలలో రిలయన్స్ జియో కొత్త యూజర్ల సంఖ్య భారీగా క్షీణించింది.

అయితే చార్జీలు పెంచకముందు నవంబరులో 5.60 లక్షల మంది కొత్త ఖాతాదారులు జియోను ఎంచుకోగా, టారిఫ్ చార్జీల పెంపు తర్వాత డిసెంబరులో ఆ సంఖ్య ఏకంగా 82,308 మందికి పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఖాతాదారులు క్యూకట్టారు. ఇక, వొడాఫోన్ ఐడియా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా తయారైంది.

టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. డిసెంబరులో 4,26,958 మంది కొత్త చందాదారులు బీఎస్ఎన్ఎల్‌ను ఎంచుకున్నారు. అదే సమయంలో జియోలో చేరిన వారి సంఖ్య 82,308 మందే కావడం గమనార్హం. అయినప్పటికీ మార్కెట్ వాటాలో జియోనే టాప్. 32.14 శాతం వాటాతో టాప్‌లో కొనసాగుతోంది. 28.89 శాతంతో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో 28.43 శాతం మార్కెట్ వాటాతో భారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానంలో ఉంది. ఇక డిసెంబరు 31తో ముగిసిన నెలలో వొడాఫోన్ ఐడియా 36,44,453 మంది ఖాతాదారులను కోల్పోయింది.

- Advertisement -