ఈఎంఐలపై 3 నెలల మారటోరియం- ఆర్బీఐ

623
RBI governor
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటనలు చేసింది. కరోనా విస్తరణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. గత నాలుగు రోజులుగా పరపతి సమీక్షను జరిపిన ఆర్బీఐ, రెపో రేటును ముప్పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా ప్రకటించారు.

ఇదే సమయంలో రివర్స్ రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈమధ్య కాలంలో ఇంత భారీ మొత్తంలో వడ్డీ రేటు కోతను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ తగ్గిపు తరువాత రెపో రేటు 4.4 శాతానికి చేరుతుంది. బ్యాంకులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుందన్న ఉద్దేశంతోనే రెపో, రివర్స్ రెపోల మధ్య వ్యత్యాసాన్ని పెంచామని ఈ సందర్భంగా శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపైనా కన్నేసి ఉంచామని తెలిపారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ అన్నారు.

అలాగే బ్యాంకులకు చెల్లించవలసిన అన్ని రుణాల వాయిదాలపై మూడు నెలల పాటు మారటోరియం ప్రకటించారు. ఈ విషయాలను ఆర్బిఐ గవర్నర్ ప్రకటించి.. ఇండియాలో ఇంకా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన అన్నారు. మూడు నెలల పాటు ఈఎమ్ఐ లు కట్టకపోయినా బ్యాంకులు అడగవని అన్నారు. సహకార రుణాలపై కూడా మూడు నెలలపాటు మారటోరియం ఉంటుందని ఆయన చెప్పారు.ఇప్పుడు చెల్లించవలసిన ఈ ఎమ్.ఐలు తర్వాత కాలంలో ఎప్పుడైనా చెల్లించవచ్చని కూడా తెలిపారు. అయినా రుణగ్రహీతల స్కోర్ తగ్గించబోమని ఆయన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

- Advertisement -