కోచ్ వేధించాడు..కన్నీళ్లు ఆగలేదు:మిథాలీ

83
mithali

ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ సెమీస్‌లో తనకు చోటు దక్కకపోవడంపై స్పందించింది వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌. తనకు తుదిజట్టులో చోటు దక్కకపోవడంతో కన్నీళ్లు ఆగలేదన్నారు. కోచ్ రమేశ్ పొవార్ తనను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పొవార్ తనని మానసికంగా వేధించాడని సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు, మాజీ క్రికెటర్ డయానా తన అధికారాన్ని ప్రయోగించి తనను తప్పించిందని ఆరోపించింది.

ఈ మేరకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సాబా కరీమ్ కు రాసిన లేఖ రాసింది. ఇరవై ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్ లో తొలిసారి కుంగిపోయానని, ఆత్మవిశ్వాసం కోల్పోయానన్నారు. టీ-20 టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ పై తనకెలాంటి వ్యతిరేకత లేదన్న మిథాలీ టీమ్ నుంచి తొలగించాలని చెప్పిన కోచ్ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే
ఎంతో బాధించిందని తెలిపింది.

నెట్స్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తున్నా.. అక్కడే నిలబడి వారి ఆటని పరిశీలిస్తూ సలహాలు, సూచనలు చేసే పొవార్.. నేను బ్యాటింగ్ చేస్తుంటే మాత్రం అక్కడ ఉండకుండా పక్కకి వెళ్లిపోయేవాడని మిథాలీ తెలిపారు. ఏదైనా మాట్లాడాలని దగ్గరికి వెళ్తే.. వెంటనే ఫోన్ చూడటం లేదా అక్కడి నుంచి వెళ్లిపోవడమో చేసేవారని అన్నారు. మిథాలీ రాజ్‌ రాసిన లేఖ బీసీసీఐలో ప్రకంపనలు సృష్టిస్తోంది.