దటీజ్‌ రజనీ..ఏకంగా ఇల్లు కొనిచ్చాడు..!

294
rajinikanth

తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజే వేరు. కండక్టర్ స్ధాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీ ఎంతో సింపుల్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అంతేగాదు మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటారు. తాజాగా ఓ నిర్మాతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రియల్‌ హీరో అనిపించుకున్నారు.

రజనీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి సినిమా భైరవి. 1978లో ఈ సినిమా విడుదల కాగా నిర్మాత కలైజ్ఞానం ఈ మూవీని నిర్మించారు. తన సినీ కెరీర్‌ గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఫస్ట్ సినిమాను గుర్తుచేసుకునే రజనీ ఈ మూవీ తనకు ఎంతో ప్రత్యేకమని చెబుతుంటారు.

ఇటీవల కలైజ్ఞానం సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారతీరాజా,శివకుమార్‌తో పాటు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివకుమార్ …ఇప్పటివరకు కలైజ్ఞానం నేటికి అద్దె ఇంట్లో ఉంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు సాయం చేయాలన్నారు.

దీంతో వెంటనే స్పందించిన రజనీ తానే కలైజ్ఞానంకు ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పారు. చెప్పిన రెండు నెలల్లోనే కోటి రూపాయల విలువైన ఇంటిని కలైజ్ఞానంకు కానుకగా ఇచ్చారు. ఇక సోమవారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి రజనీ హాజరయ్యారు. కలైజ్ఞానం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రజనీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.