నాకూ డబ్బుంది…

330
- Advertisement -

గత ముప్ఫై సంవత్సరాలుగా విప్లవ భావ సినిమాలు తీస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. సినిమా స్టార్లంటే.. ఆకాశంలో నక్షత్రాల్లా ఎవరకీ అందరు. నిన్న మొన్న సినిమాల్లోకి ప్రవేశించిన కమెడియన్లు కూడా జనాలకు కనబడకుండా కార్లలో తిరుగుతుంటారు. కానీ, 30 ఏళ్ల క్రితమే హీరోగా మారిన ఆర్‌.నారాయణ మూర్తి అందుకు భిన్నం కనిపిస్తుంటారు. ఇప్పటికీ ఆయన హైదరాబాద్‌లో ఆటోలోనే తిరుగుతుంటారు. ఫిల్మ్‌నగర్‌ మెస్‌లోనే భోజనం చేస్తారు. అప్పుడప్పుడు రోడ్డుపై తిరుగుతూ కనబడుతుంటారు. దీనికి కారణమేంటి. ఆయన దగ్గర కారు కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేవా. ఈ ప్రశ్నకు ఆర్‌.నారాయణ మూర్తి ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు.
r narayana murthy interview
సిల్వర్, డైమండ్ జూబ్లీ సినిమాలు తీసి, కోట్లు గడించినవాణ్ణి. నా దగ్గర బ్యాలెన్స్ ఎందుకుండదు? అది తీసిపారేయండి. చిన్నప్పటి నుంచి నాకిలా ఉండడం అలవాటు. ఏదో పోజు కొట్టడం కోసం ఇలా ఉంటాననుకుంటున్నారేమో? నేనలా ఆత్మవంచన చేసుకోను. నాకిప్పుడు 62 ఏళ్లు. కాలేజీ డేస్‌లో కూడా నాకు రెండు జతల బట్టలే ఉండేవి. వాచీలు, గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమ బాటే. ప్రజల పక్షానే. నా లైఫ్ స్టైల్ ఇది. ఎవరి మెప్పుకోలు కోసమో ఉండట్లేదు. ఇలా ఉండటమే నాకు ఆనందం. నా సినిమా కోట్లు తెచ్చినప్పుడు నాకు బీరువా లేదు. డాక్యుమెంట్లు లేవు. చాప, దిండు మాత్రమే. డబ్బులు తేనప్పుడూ నా దగ్గర ఉండేది చాపా, దిండూనే అని సమాధానం ఇచ్చారు.
r narayana murthy interview
అలాగే చాలామంది ఆర్‌.నారాయణ మూర్తి తన సొంత ఊర్లో ఆస్తులు కూడబెట్టాడని అంటుంటారని, అయితే అదంతా అబద్ధమేనని అన్నారు. తన ఊర్లో ఆస్పత్రి కట్టించడానికి, విద్యాలయాలకు డొనేషన్లు ఇవ్వడానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాగునీటి కోసం చాలా బోర్లు వేయించడానికి తన డబ్బు వెచ్చించానని చెప్పారు. అలాగే తాను ఏ రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని, తనో కామన్‌మ్యాన్‌ని మాత్రమే అని స్పష్టం చేశారు.

r narayana murthy interview
అలాగే ఈ ఇంటర్వ్యూలో పెద్దనోట్లపై కూడా నారాయణమూర్తి స్పందించారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాళ్ల ఇబ్బందుల గురించి ఆలోచించాలి. దీన్నే అదనుగా తీసుకుని పెట్రోల్ బంకుల్లో, కొన్ని కిరాణా షాపులో 500 నోటిస్తే.. నోటుకు సరిపడా కొనాల్సిందేనంటున్నారు. మోడీగారు వాగ్దానం చేసినట్లుగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు తెచ్చి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అది ఎందుకు చేయలేకపోతున్నారని ఆయనను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గెలవడానికి ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలు తాత్కాలిక అవసరాల కోసం ఓటేసినంత వరకూ సమాజం బాగుపడదు. అందుకే ఓటేసే ముందు శాశ్వతాన్నిదృష్టి పెట్టుకోవాలి అని నారాయణమూర్తి అన్నారు

- Advertisement -