మోడీ నోట.. కేసీఆర్ ‘నారా’

281
PM Modi
- Advertisement -

‘ఆర్థిక సామాజిక న్యాయానికి సరియైన దారి సమాఖ్య న్యాయాన్ని సాధించడమే’ననే ఫెడరల్ నినాదంతో లోక్ సభ ఎన్నికల్లో పాల్గొన్న ఒకే ఒక్క జాతీయ’ నాయకుడు సిఎం కెసిఆర్. ఈ నినాదం భారతదేశ పాలకులకు కెసిఆర్ అందించిన రాజకీయ దార్శనికత. ఈ నారా’.. కొన్ని అవకాశవాద రాజకీయ కూటములకు తక్షణమే అర్థం కాకపోవచ్చు కానీ., ఇదే నారా’ భవిష్యత్తు భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేయనున్న నినాదమని నిన్నటి మోడీ ప్రసంగం స్పష్టం చేసింది.

తనను బిజెపీ లోక్ సభా పక్షనేతగా ఎన్డీఏ పక్షాల ప్రధాని అభ్యర్థిగా సహచర ఎంపీలు ఎన్నుకున్న అనంతరం సెంట్రల్ హాల్లో మనసువిప్పిన మోడీ… నారా’ అనే నినాదాన్ని ముందుకు తేవడం, సిఎం కెసిఆర్ ఫెడరల్’ కృషి ఫలితమేననేది నిర్వివాదాంశం. ‘జాతీయ ఆశయాలు ప్రాంతీయ ఆకాంక్షలు’ ( National Ambition Regional Aspiration – NARA) అనేది తమ ఎన్డీఏ ప్రభుత్వపు నూతన పరిపాలనా విధానంగా ప్రధానిగా ఎన్నికయిన మోడీ తన ప్రసంగంలో స్పష్టం చేసినారు. ఇదే నినాదం.. ఇన్నాల్లుగా.. తెలంగాణ సమాజం తరపున సిఎం కెసిఆర్ భారత జాతికి వినిపిస్తున్న ఫెడరల్ స్పూర్తి’ అనే నినాదం కావడం గమనించాల్సిన అంశం. అదే నినాదం (హిందీలో నారా) కేంద్ర ప్రభుత్వపు నూతన పాలనా విధానం కావడం హర్షించదగ్గ పరిణామం. ఈ ఎన్నికల్లో ‘ఫెడరల్ స్పూర్తి గెలువాలె’ అనే తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు నరేంద్ర మోడీ నారా’ అద్దం పడుతున్నది.

PM Modi

ఇదొక్కటే కాదు.. సిఎం కేసీఆర్ అనుసరిస్తున్న అత్యంత కీలకమైన సామాజిక రాజకీయ లౌకిక విధానాలు నిన్నటి మోడీ ప్రసంగంలో ముందుకు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది.. మైనారిటీలను కలుపుకు పోయే ‘సబ్ కా విశ్వాస్’ అనే నినాదాన్ని మోడీ జత చేయడం. అటు హిందు మతాన్ని ఇటు ముస్లిం తదితర మైనారిటీ మతాలను కుడి ఎడమ భుజాల్లాగా కలుపుకపోతూ..పాలన సాగిస్తున్నది కెసిఆర్ ప్రభుత్వం. ఇది సిఎం కెసిఆర్ కు ఎట్ల సాధ్యమైతున్నదని ఇప్పటికే ప్రపంచం ఆశ్చర్యానికి గురయితున్నది. హిందూ ముస్లింలను పామూ ముంగీసలుగా మార్చి సాగుతున్న ఇన్నాల్ల రాజకీయ ఆటలకు తెలంగాణ పాలన ఎట్లా స్వస్తి పలికగలిగింది అనేది రాజకీయ విశ్లేషకులకూ ఇప్పటికీ అంతుబట్టని విషయంగా మారింది.

అట్లా ఒక మతానికి మరో మతాన్ని బూచిగా చూయించి ఓట్లు దండుగనే దండుగ మారి ఆటకు కెసిఆర్ చరమగీతం పాడిన నేపథ్యం నభూతో నభవిష్యత్. రెండు మతాలకు లేని శత్రుత్వాన్ని అంటగట్టే రాజకీయ సామాజిక సాంస్క్రతిక మానసిక వికారాల నుంచి మతతత్వవాదులను దూరం చేస్తూ సాగుతున్న కెసిఆర్ ప్రయాణం ఇవాల దేశ పాలకులకు కనువిప్పు కలిగించింది. అందుకు నిదర్శనమే.. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే తన మొన్నటి ఎన్నికల నినాదానికి, కొత్తగా ‘సబ్ కా విశ్వాస్’ అనే నినాదాన్ని మోడీ జతచేయడం. ఈ కొత్త నినాదం వెనక సిఎం కేసీఆర్ విజన్ వున్నది. హిందూ మతాచారాలకు పెద్దపీట వేస్తూనే ముస్లిం క్రిస్టియన్ తదితర మైనారీటీ మతాచారాలనూ అక్కున చేర్చుకోవడం అనే తెలంగాణ ప్రభుత్వపు లౌకిక కార్యాచరణ దార్శనికత, మోడీ తన శ్రేణులకు అందించిన నూతన నినాదంలో దాగి వున్నది. ముస్లిం తదితర మైనారిటీ మతాలను ఆచరిస్తున్న ప్రజలకు అభివ్రుద్ది సంక్షేమ రంగాల్లో పెద్దపీట వేస్తూ.. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి తన కార్యాచరణ ద్వారా లోకానికి ఆదర్శంగా నిలిచిన్రు. నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నా…పరమతాల పట్ల సహనం సౌభ్రాత్రుత్వాన్ని ప్రదర్శించాలనే రాజ్యాంగ లౌకిక స్పూర్తిని అనుసరిస్తున్న దార్శనిక సిఎం కెసిఆర్ ఆలోచనా పరంపరకు నిన్నటి మోడీ మాటలు అద్దం పడుతున్నయి.

అదే విధంగా… సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే మోడీ నినాదాన్ని కూడా ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఆచరణలో పెడుతూ ముందంజలో వున్నది. తెలంగాణలో సబ్బండ వర్గాలను ఉత్పత్తి కులాలను కలుపుకపోతూ వారే కేంద్రంగా అమలు పరుస్తున్న అభివ్రుద్ది సంక్షేమ పథకాలు ఇప్పటికే కేంద్రం సహా అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అట్లా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదాన్ని తెలంగాణ ఏర్పాటు నాటినుంచే అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.

అదే విధంగా.. నిన్నటి నరేంద్ర మోడీ ప్రసంగంలో చాలా అంశాలు… ఇప్పటికే కెసిఆర్ అనుసరిస్తున్నవేనని చెప్పటానికి తెలంగాణ సమాజం గర్విస్తున్నది. అయినదానికీ కానిదానికీ హిందూ మతం పేరుతో అదేపనిగా ప్రచారం చేసుకోవడం తగదని మతతత్వ వాదులకు ఎన్నికల సభలో కేసీఆర్ ప్రశ్నవేసినారు. దీని సారం కూడా నిన్నటి మోడీ ప్రసంగంలో వినిపించింది. తన సుధీర్ఘ ప్రసంగంలో వొకచోట మోడీ…‘పనిచేసుకుంటూ పోదాం..ప్రచారం కోసం పాకులాడవద్దు’..అని బిజెపీ శ్రేణులకు పిలుపునిస్తారు. దాని అర్థమే.. మొన్నటి ఎన్నికల సభలో సిఎం కేసీఆర్ ప్రసంగంలో.. ‘హిందువులం హిందువులం..పొద్దాక ఏందయా ఇది..మీరేనా హిందువులు మీంగాదా..? ’ అని వేసిన ప్రశ్న సారాంశం. మన పనితనం మనం అనుసరించే కార్యాచరణ ద్వారా మాత్రమే బయటపడుతుంది తప్ప.. అనవసరమైన ప్రచారాల ద్వారా కాదు. అనవసర ప్రచారాల ద్వారా రాజకీయ లబ్దిపొందాలనే దుగ్ద..సమాజ విభజనకు దారితీస్తది అనేదే..మొన్న కేసీఆర్ చెప్పినదైనా నిన్న మోడీ చెప్పినదైనా..అనేది ఎవరైనా గ్రహించాల్సిన అక్కెరున్నది.

కేంద్ర ప్రభుత్వం అనుసరించే కెసిఆర్ నినాదాలు ఇవే కాదు ఇంకా వున్నయి. కేంద్ర ప్రభుత్వమే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు… రాజకీయాలకు అతీతంగా ప్రజలకు దార్శనిక పాలన అందించాలంటే… కేసీఆర్ నారా’ (నినాదాన్ని) ను అనుసరించాల్సిందే.

- Advertisement -