ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ:టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్

787
trs naveen
- Advertisement -

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్ధానానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు సీఎం కేసీఆర్. పార్టీ సీనియర్ నేత కుర్మయ్యగారి నవీన్ కుమార్ పేరు ఖరారు చేశారు. గత పార్లమెంట్ఎన్నికల సందర్భంగా నవీన్‌ కుమార్ తో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డిలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఈ హామీ మేరకు నవీన్‌ కుమార్ కు అవకాశం కల్పించారు.

ఇక త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్ధానాలలో గుత్తాకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజీనామాతో ఎన్నిక అనివార్యం కాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌రావును ప్రకటించారు సీఎం. అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నికల లాంఛనమే కానుంది.

విద్యార్ధి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు కుర్మయ్యగారి నవీన్‌కుమార్. ఆయన తాత రామచందర్‌రావు మాజీ మంత్రి. మామ సుదర్శన్‌రావు టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. నవీన్ ఎంబీఏ పూర్తిచేసి భవన నిర్మాణరంగంలో అంచెలంచెలుగా ఎదిగారు.2009లో కూకట్‌పల్లి నియోజకవర్గంలో మేనమామ సుదర్శన్‌రావు పోటీచేసినప్పుడు ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా 14 డివిజన్లలో ప్రచారాన్ని పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన అఖండ విజయంలో నవీన్ ముఖ్యపాత్ర పోషించారు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో తన సొంత ఖర్చుతో వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవీన్‌కుమార్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేశారు.

naveen rao

- Advertisement -