రొమాంటిక్ కామెడీ ‘నరుడా…డోనరుడా’

333
naruda donoruda review
- Advertisement -

2014లో వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ అనే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని హీరో సుమంత్ ‘నరుడా డోనరుడా’ అనే సినిమాతో వచ్చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే సినిమాకు రీమేకే ఈ ‘నరుడా డోనరుడా’! ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్‌తో ఎక్కడిలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం గ్యాప్‌ తర్వాత వెండితెరమీద అలరించేందుకు వచ్చిన సుమంత్…ప్రేక్షకులకు ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడా..?సుమంత్‌ కెరీర్‌ని మార్చేసే చిత్రం అవుతుందా? లేదా చూద్దాం..

కథ:

విక్కీ (సుమంత్‌) ఓ మధ్య తరగతి యువకుడు. క్రికెటర్‌. అమ్మ(శ్రీలక్ష్మి).. నాయనమ్మలతో సంతోషంగా గడిపేస్తుంటాడు. తన ఖర్చు..అవసరాల కోసం వీర్యాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌) అనే బెంగాలీ అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తానూ మెల్లమెల్లగా విక్కీ ప్రేమలో పడిపోతుంది. అయితే తాను ఇది వరకే ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది.

naruda donoruda review

అయితే..విక్కీ మాత్రం…తానో స్పెర్మ్ డోనర్ అన్న నిజాన్ని దాస్తాడు. ఓ సందర్భంలో ఈ నిజం అషిమాకు తెలిసిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది..?విక్కీని ఆషిమా అర్థం చేసుకుంటుందా..?వీరి వైవాహిక జీవితం ఏమైంది? అన్నదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథా, నేపథ్యం,కామెడీ,సుమంత్,తనికెళ్ల భరణి. బాలీవుడ్‌ మూవీ ‘విక్కీ డోనర్‌’ చూసిన వాళ్లకు ఈ సినిమా కాపీ పేస్ట్‌లానే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ కథా నేపథ్యం కొత్తగా అనిపిస్తుంది. వీర్యదానం, విత్తనం..అంటూ సున్నితమైన విషయాన్ని డీల్‌ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ఎక్కువ శాతం కామెడీని జోడించి సినిమాను తెరకెక్కించారు. సెకండాఫ్‌లో భావోద్వేగ సన్నివేశాలు నడుస్తాయి.పతాక సన్నివేశాలు హత్తుకొనేలా తీశాడు దర్శకుడు.

సుమంత్ బాడీ లాంగ్వేజ్‌.. డైలాగ్‌ డెలివరీ మారాయి.ఈ తరహా ఉత్సాహభరిత పాత్ర చేయడం సుమంత్‌కి ఇదే తొలిసారి. చురుగ్గా నటించాడు. ఆంజనేయులుగా భరణి తన అనుభవాన్నంతా రంగరించారు. వినోదం పండించడంలో ఆయనదే ప్రముఖ పాత్ర. శ్రీలక్ష్మి చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి పాత్రలో కనిపించారు. ఆంజనేయులు అసిస్టెంట్‌గా సుమంత్‌ శెట్టి మెప్పించాడు.చివర్లో నాగచైతన్య ఎంట్రీ.. అక్కినేని అభిమానుల్ని ఉత్సాహపరుస్తుంది.

మైనస్ పాయింట్స్:

కథా నేపథ్య పరంగా చూస్తే.. ఇది సాహసోపేతమైన ప్రయత్నమే. వీర్యదానం అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటే తొలి భాగాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. అదేదో చూడకూడనిది.. చేయకూడనిది అనుకొంటే ఆయా సన్నివేశాలు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడొచ్చు. హీరోకి హీరోయిన్‌తో కెమెస్ట్రీ కంటే ఆంజనేయులు అనే పాత్రతో కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

naruda donoruda review

సాంకేతిక విభాగం:

విక్కీ డోనర్ లాంటి బోల్డ్ సబ్జెక్ట్ను తెలుగు తెర మీద చూపించాలన్న నిర్ణయం సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసానికి రెడీ అయిన దర్శకుడు మల్లిక్ రామ్, అందుకు తగ్గ కథనాన్ని సిద్ధం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ పెద్దగా పండకపోవటం మేజర్ మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి.సెకండ్ హాఫ్లో అసలు కథలోకి ఎంటర్ అయిన తరువాత వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. శ్రీ చరణ్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.సాంకేతికంగా మాటల రచయితల పతిభ కనిపిస్తుంటుంది. తమాషా పద ప్రయోగాలు చేశారు. ‘విత్తనం’ అనే మాటను చాలా రకాలుగా.. చాలాసార్లు వాడారు.తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమానే అయినా నాణ్యత కనిపిస్తుంది.

తీర్పు:

సుమంత్‌ నుంచి రెండేళ్లుగా సినిమా రాలేదు. ఆయన మంచి కథ కోసం ఎదురు చూసీ.. చూసీ చేసిన సినిమా ‘నరుడా డోనరుడా’. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్‌’కి ఇది రీమేక్‌. కథా నేపథ్య పరంగా చూస్తే.. ఇది సాహసోపేతమైన ప్రయత్నమే. ఓ స్పెర్మ్‌ డోనార్‌ కథ ఇది. వీర్యదానం, విత్తనం..అంటూ సున్నితమైన కథ, సుమంత్,తనికెళ్ల భరణి నటన..ముఖ్యంగా ఆంజనేయులు పాత్రలో తనికెళ్ల భరణి నటన హైలెట్ కాగా…కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం మైనస్ పాయింట్. మొత్తంగా కొత్త,కథా నేపథ్యంలో తెరకెక్కిన నరుడా…డొనరుడాతో సుమంత్ మెప్పించాడనే చెప్పాలి.

విడుదల తేదీ:04/11/2016
రేటింగ్: 2.5/5
నటీనటులు: సుమంత్‌, పల్లవి సుభాష్‌..
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
నిర్మాతలు: సుప్రియ, జాన్‌సుధీర్‌ పూదోట
దర్శకత్వం: మల్లిక్‌ రామ్‌

- Advertisement -