ప్రజల ప్రయోజనం లేని ఆర్టీసీ సమ్మె

418
rtc strike
- Advertisement -

ఆర్టీసీ కార్మికులు ,ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రజా  వ్యతిరేకమైంది. ప్రజలకు ఈ సమ్మెతో ఏమాత్రం సంబంధం లేదు. సమ్మెలో  ప్రజా ప్రయోజనం లేదు. ప్రజలెవరూ మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమ్మెలోకి దిగటం అసంబద్ధమైంది. ఈ డిమాండ్ వారి మానసిక ఆనందానికి సంబంధించినది ..తప్ప ప్రజల ప్రయోజనం లేదు. బస్సుచార్జీల అంశమే ప్రజలకు సంబంధించినది. గత 5 సంవత్సరాల గా ఒక్క రూపాయి బస్ చార్జీలు పెంచకుండా ప్రభుత్వ మద్దతు తో నడుస్తున్న సంస్థను నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు సమ్మెతో అర్థం అవుతుంది. బస్ చార్జీలు పెంచకుండా నడిపిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు కావలసిన జీతాలను కూడా ప్రభుత్వం  పెంచింది.

గతంలో పెంచిన జీతాలకు ఉద్యోగులంతా సంతృప్తిగా ఉన్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో డిజిల్ రేట్ ఎన్నో రెట్లు పెరిగింది. అయినా  ప్రజలపై భారం మోపలేదు. ప్రభుత్వమే వాటిని భరించింది. అప్పులు ఉన్నా.. బకాయిలు ఉన్నా.. ప్రభుత్వమే ముందో.. వెనకో.. వాటిని భరిస్తుంది.. భవిష్యత్తులో కూడా  భరించనుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేయడం వల్ల వారి జీవన ప్రమాణాలు కూడా కొంత మెరుగ్గానే ఉన్నాయి. రాష్ట్ర జనాభా దాదాపు నాలుగు కోట్ల మంది ఉంటే మొదటి 30 -40 లక్షల మందిలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఉంటారు. మిగతా మూడు కోట్లకు పైగా జనాభా కు వీరికి అందే సౌకర్యాలు లేవు. జీవన ప్రమాణాలు లేవు.  ఇది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు వారికి మద్దతు తెలిపిన వారు అర్థం చేసుకోవాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనే డిమాండ్లో లాజిక్ కూడా లేదు. 40 ,50 సంవత్సరాలుగా ఆర్టీసీ  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

దీనికి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది.  50 శాతం ఆర్టీసీ బస్సులు ,30 శాతం అద్దె బస్సులు, 20 శాతం స్టేజి క్యారేజి లు గా అనుమతి ఇవ్వటం ఇది కొత్త ప్రతిపాదన. బస్సు ఛార్జీల పెంపు, తగ్గింపు పూర్తిగా సంస్థ లేదా ప్రభుత్వం నియంత్రణలో ఉండే విధంగా ఈ ప్రతిపాదన ఉంది. ఆర్టీసీని ప్రైవేటు కరించే సమస్య లేదని ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసింది. వీటన్నింటినీ పట్టించుకోని యూనియన్, వారికి మద్దతు తెలిపే సంస్థలు విలీనం అనే డిమాండ్ తో మొండిగా వ్యవహరిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం లో విలీనం చేస్తే ఉద్యోగులు మానసికంగా ప్రభుత్వ ఉద్యోగులమనె ఆనందం.. సంతృప్తి  చెందవచ్చు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు స్వతంత్ర సంస్థగా ఉన్న ఆర్టీసీ విషయంలో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. కార్పొరేషన్ ను పరిగణలోకి తీసుకుంటుంది. అంతేగాక ఆర్టీసీకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెబుతున్న ఉద్యోగులు.. వీటిని ప్రభుత్వ చేతుల్లో ఎందుకు పెట్టాలి. ప్రభుత్వంలో విలీనం అయితే ఉద్యోగులు భయపడే ప్రైవేటీకరణ ఇంకా సులభతరం అవుతుంది. జీతాల విషయంలో కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కంటే ఆర్టీసీ వారి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్ టి సి లో వేలమంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.  ప్రభుత్వంలో విలీనం అయితే శాశ్వత ఉద్యోగాలు తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు . అన్ని శాఖల మాదిరిగానే కాంట్రాక్టు పద్ధతిలో.. ఔట్ సోర్సింగ్ లో.. ఉద్యోగుల భర్తీ చేస్తే దీనికి యూనియన్లు ఏమి సమాధానం చెబుతాయి. వీరి వ్యవహారం ఆర్టీసీ భవిష్యత్తులో  ఎలా పోతే మాకేంటి అనే ధోరణి కనిపిస్తుంది.

ప్రస్తుతం 50 వేల మంది ఉన్నాము. విలీనం చేస్తే రిటైర్డ్ అయ్యేంతవరకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటాము.. అనే స్వార్థపూరితమైన ఆలోచన మానసిక ఆనందం తప్ప ఇందులో ప్రజల ప్రయోజనం.. ప్రజా రవాణా ప్రయోజనం లేనే లేదు. ఈ యాభై వేల మంది స్వార్ధానికి మిగతా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. బస్సు చార్జీలు పెంచకుండా నడిపిస్తున్న ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని విలీనం చేస్తే రాష్ట్రంలో ఉన్న అనేక కార్పొరేషన్లు కూడా విలీనం చేయాలని డిమాండ్ చేస్తాయి. ఆర్టీసీని బలోపేతం చేయడానికి కొత్త ప్రతిపాదనలు తెచ్చామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు విశ్వసించాల్సిన అవసరం ఉంది. సంవత్సరాలుగా పరిష్కారం కాని అంశానికి కొత్త ఆలోచనలతో సంస్థను లాభాల్లోకి తీసుకువస్తామని ప్రభుత్వం చెప్పే మాటను నమ్మకుండా యూనియన్లు, మద్దతు తెలిపే సంస్థలు ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ఈ వాస్తవాలను ఆర్టీసీ కార్మికులు ,ఉద్యోగులు గ్రహించి యూనియన్ నాయకత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. విలీన డిమాండ్ ను  పక్కనబెట్టి  జీతాల పెంపు, ఇతర సంక్షేమ డిమాండ్ ను ముందుకు తెస్తే ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. లేదా మీరు చేసే సమ్మెతో కొన్ని సంస్థలకు, పార్టీలకు, వ్యక్తులకు ,ప్రభుత్వం పైన.. ముఖ్యమంత్రి పై ఉన్న ఫ్రస్టేషన్ చల్లార్చుకునేందుకు  పావులుగా ఉపయోగపడతారు.

                                                                          narra vijaykumar

                                                                          నర్రా విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్

- Advertisement -