ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలి

86
ts govt

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ఎన్నుకునే పార్టీలు, నాయకులే.. రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ రాజ్యంలో ప్రజల ప్రయోజనాలే పరిపాలించేవారు ప్రాధాన్యతగా పెట్టుకుంటారు.  తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమం, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో లక్ష్యంతోనే ప్రణాళికలు రూపొందించుకొని అమలు  చేస్తున్నారు. తన లక్ష్యాలను అమలు చేయాల్సింది.. ప్రభుత్వ ,ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు. ఎన్నో ఉద్యమాలు చేసి  కొట్లాడి.. తెచ్చుకున్న తెలంగాణలో రాజ్య పాలకుడికి ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధి ,వేగం.. ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఎక్కువగా ఉండాలి. పాలకుడుఇచ్చే ఆదేశాలు సూచనలను కనుసైగలతో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంటుంది .చూసి రమ్మంటే కాల్చి వచ్చిన సామెత లాగా నాలుగు కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి  తీసుకునే నిర్ణయాలను యధాతథంగా అమలు చేస్తూ.. ఉద్యోగులు తమ  సృజనాత్మకతను జోడించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని ఎక్కువ సేవలు అందించాలి. అలా అందించిన రోజే తెలంగాణ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుంది. అయితే ఇక్కడ పూర్తిగా రివర్స్ జరుగుతోంది. ముఖ్యమంత్రి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గురించి నిర్ణయాలు తీసుకుంటుంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు,ప్రభుత్వ ఉపాద్యాయులు, అద్యాపకులు  తెలంగాణ అంటే మేము.. మా కోసమే తెలంగాణ వచ్చింది.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సమాజం అంతా కొట్లాడితేనే.. రాష్ట్రం సాకారం అయిందని విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు మరచిపోతున్నారు. ఉద్యమ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉన్న వెసులుబాటు తో.. మీడియాలో ముందుభాగాన కనిపించారు. ప్రైవేటు రంగంలో ఉండే అనేక వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు అయినారు.

ఉద్యమ సమయంలో వచ్చిన పోరాటాలు ,ఆందోళనలు , ఉపఎన్నికల్లో… ప్రైవేటు ఉద్యోగులు ,రైతులు ,కూలీలు నైతిక మద్దతు తో పాటు ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నారు. ఉపఎన్నికలు వస్తే బరిగీసి తెలంగాణ సమాజం అంతా ఒకవైపు ఉన్నామని తీర్పునిచ్చారు. ఇవి అన్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. తెలంగాణ వచ్చింది మా కోసమే అన్నట్టు.. ప్రభుత్వ ,ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధ్యాపకులు.. వ్యవహరించ వద్దు. తెలంగాణ వచ్చింది ..ఇక జీతాలు పెంచాలి ..సౌకర్యాలు పెంచాలనే డిమాండ్ తప్ప ప్రజలకు బాధ్యతతో సేవలు అందించాలనే ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులకు ఉండటం లేదు. నాలుగు కోట్ల ప్రజల గురించి ఆలోచించి ప్రణాళికలు రూపొందిస్తున్న..ప్రభుత్వాదినేత పై.. ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం విమర్శలు చేయడం సరైంది కాదు. రాష్ట్రం ఎటుపోతే మాకేంటి మాకు జీతాలు ఇతర సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ ..ఆలోచన ..తప్ప ఉద్యోగులకు మరొక ఆలోచన చేయడం లేదు. ఉద్యమంలో ఉన్నది మేమే  అని అతివిశ్వాసం.. అత్యుత్సాహంతో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం ప్రయత్నం చేయబోతున్నారు. గత సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని ప్రభుత్వ పెద్దలతో ఉద్యోగ సంఘాల నాయకులు  నేరుగా సవాల్ కూడా విసిరారు. అయితే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇవేవి పట్టించుకోకుండా సాధారణ ప్రజలు రైతులు ఇతర వర్గాల ప్రజలకు సేవలు అందించి తిరిగి అధికారంలోకి వచ్చారు.

అప్పటినుంచి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు అధ్యాపకులు వశ పడటం లేదు. ఉద్యోగులను జర్నలిస్టులు పలకరిస్తే చాలు ప్రభుత్వాదినేత పై ఆఫ్ ద రికార్డుల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.మేం లేకపోతే కేసీఆర్ లేరనే అహంకారం బాగా పెరిగింది. మేము చెప్పినట్లు వినడం లేదు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు మేం చెప్పినట్టు వినేవారు.. అనే పోలికతో వాదనలకు దిగుతున్నారు. మాకు జీతాలు పెంచరు.. కానీ ప్రతి రైతుకు రైతుబంధు అవసరమా..ఎందుకండీ ఇలాంటి పథకాలు అంటున్నారు. ఈ వాదనలకు ఎంత వరకు వెళ్ళేవి అంటే.. నేను సచివాలయంలో ఉద్యోగిని నాకు ఎందుకు రైతు బంధు ఇవ్వాలి అని ప్రశ్నించేవారు. రాష్ట్ర మీద ప్రేమ ఉంటే రైతుబంధు వదులుకొని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయండి అంటే మాత్రం నేను ఎలా వదులుకుంటా అని సమాధానం ఇచ్చేవాడు ఆ సచివాలయ ఉద్యోగి. ఇలా ప్రభుత్వంపై,ప్రభుత్వాదినేతపై విమర్శలు చేయడం.. తులనాడటం.. వ్యతిరేక ప్రచారం చేయడం ఎక్కువైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ప్రజల తో కనెక్ట్ కావడం ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చటం లేదు. ఈ సమయంలో వచ్చిన ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధ్యాపకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు.

ప్రజల్లో గందరగోళం సృష్టించే పని చేశారు .అయితే కొంతమంది మేధావులు గా చెప్పుకునే వారు తప్ప.. ఇతర వర్గాల ప్రజలు ఆ ప్రయత్నాలను పట్టించుకోలేదు. ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులు సమ్మె చేస్తే ప్రజలంతా నిరాసక్తత చూపిస్తారా.. మన సమాజం ఎటుపోతుందంటూ..  వ్యాసాలు కూడా రాశారు. అసలు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పట్ల.. సాధారణ ప్రజలు ,రైతులు, ప్రైవేటు ఉద్యోగులు, కూలీలు, ఇతర వర్గాల ప్రజలు ఎందుకు ఆసక్తి చూపాలి. వారి జీతాల పెంపు కోసం ఈ ప్రజలు ఎందుకు మద్దతు పలకాలి. వారి సంక్షేమం కోసం వీరు ఎందుకు గొంతెత్తాలి. రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభా లో అన్ని రకాలుగా ముందు వరుసలో ఉండే వారు ప్రభుత్వ ,ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధ్యాపకులు. నాలుగు కోట్ల జనాభాలో మొదటి 20 లక్షల జనాభాలో అన్ని సౌకర్యాలు.. జీవనప్రమాణాలు.. పొందుతూ ఎంజాయ్ చేస్తున్న వర్గం లో వీరు ఉంటారు .వీరు అనుభవించే సుఖాలు ,విద్య ,వైద్యం ,వినోదం గృహవసతి మరో వర్గం వారైన ప్రైవేటు, సాధారణ ఉద్యోగులు, రైతులు ,కూలీలు ,ప్రైవేటు కంపెనీలో పనిచేసే కార్మికులకు లేవు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగికి చిత్తశుద్ధితో పని చేద్దాం అనేది ఉండటం లేదు. ప్రజలు అంటే చులకన భావం.. నిర్లక్ష్యం.. అహంకారం.. పనుల కోసం వచ్చే వారి పట్ల చీదరింపులు.. అవినీతి.. క్రూరత్వంతో ఒక రకమైన మానసిక ఉన్మాదంతో ప్రజలతో వ్యవహరిస్తున్నారు .రెవెన్యూ శాఖలో పాస్ పుస్తకం కోసం.. కుల దృవీకరణ పత్రం కోసం.. భూమి బదలాయింపు కోసం..పహానీ లో పేరు రాయడం కోసం.. సంవత్సరాలు.. సంవత్సరాలు ప్రజలను తిప్పించుకొని.. ఎంతో మానసిక వేదనకు గురి చేస్తూశాడిస్టుల్లా ఆనందం పొందటం లేదా ఈ  ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉపాధ్యాయుల వ్యవహారించే తీరు మరీ దారుణంగా ఉంటుంది. యూనియన్ల పేరుతో ప్రభుత్వాన్ని శాసించాలనుకుంటారు. పేద పిల్లలకు చదువు చెప్పమంటే చెప్పరు. వీరి పిల్లలను మాత్రం ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదివించి విదేశాలకు పంపుతారు. ఇటీవల పాత మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు ప్రాంతంలో కొత్త ఐఏఎస్ అధికారి అక్కడి పాఠశాలలు సందర్శిస్తే 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పాపెట్టకుండా గైర్హాజరు ఐయినారు. ఆ అధికారి షాక్ కు గురైవటం తప్ప ఏమి చేయ లేక పోయారు. నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వస్తే పేద పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి. వారిపై చర్యలు తీసుకోవాలంటే ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకోవడం…పొనీ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు తక్కువ ఉన్నాయి అంటే అదేమీ లేదు. జూనియర్ ,డిగ్రీ ,విశ్వవిద్యాలయ అధ్యాపకుల విషయం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు వ్యవహరించే తీరు బాగానే ఉన్నప్పటికీ.. ఇతర సిబ్బంది , ఉద్యోగుల నిర్లక్ష్యం ఎక్కువ .ఇన్సూస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్ లో ప్రభుత్వం అన్ని రకాల వైద్య పరీక్షలు పేదలకు చేస్తుంది.రిపోర్టులు రోగులకు ఇవ్వటం కూడా ఇక్కడి ఉద్యోగులు పెద్ద పర్వతం ఎత్తినట్టు  వ్యవహరిస్తారు .సాయంత్రం ఇచ్చే రిపోర్టును   సాయంత్రం తీసుకోక ఉదయం వెళితే మళ్లీ సాయంత్రమే  రావాలి అని గదమాఇస్తారు. తన టేబుల్ మీద వైద్య రిపోర్టులు పెట్టుకొని కూడా అందులో నుంచి తీసి ఇవ్వటమే ఉద్యోగి చేయాల్సిన పని దానికి కూడా సాయంత్రమే రమ్మంటారు.దీంతో ఆ పేద రోగి పడే ఇబ్బందులు వర్ణనాతీతం..  ఇదంతా ఉద్యోగులు గమనించరా..ఇవి వేధింపులు కావా.. వీరికి జీతాలు ప్రజల నుంచే కదా అందేవి. అయినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం ..అహంకారం.. పైగా జీతం ఇచ్చే ప్రభుత్వంపైనే దుమ్మెత్తి పోస్తారు .ప్రభుత్వాధినేత పై విమర్శలు చేస్తారు. వీరిని నియంత్రించాల్సిన అవసరం లేదా.. వీరి పట్ల ప్రజలు ఆసక్తి చూపే వారి జీతాల పెంపుకు మద్దతు ఎందుకు తెలపాలి.. తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. తెచ్చుకుంది ..ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కోసం కాదు వీరంతా ఉంటే పది లక్షల మంది ఉంటారేమో వీరిగురించి మిగతా నాలుగు కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం లేనేలేదు.. నాలుగు కోట్ల ప్రజల్లో ప్రధానమైన రైతులు, రైతు కూలీలు, ఇతర ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం.. వారి పొలాల గురించి భారీ ప్రణాళికలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు అన్ని రంగాల్లో గట్టి పునాది వేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు,ప్రభుత్వ ఉపాధ్యాయులు ,అధ్యాపకులు  వీరిని ఎట్టి పరిస్థితుల్లోనైనా  నియంత్రించాల్సిన అవసరం ఉంది .ప్రజలకు వేధింపులు లేని సేవలు అందాలంటే సాధారణ ప్రజల మద్దతు బలంగా ఉన్న ముఖ్యమంత్రి మాత్రమే సంస్కరణలు చేయగలరు . ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్న కేసీఆర్ జవాబు దారీతనం తో పనిచేసే నూతన ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉంది.

నర్రా విజయ్ కుమార్
సీనియర్ జర్నలిస్ట్