ధోనీపై మండిపడ్డ సెహ్వాగ్..!

60
MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో మిస్టర్‌ కూల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ధోనీ ప్రవర్తనపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధోనీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ధోనీ అలా అంపైర్‌పై కోపం చూపించడం ఏ మాత్రం సబబు కాదంటూ దుమ్మెత్తిపోశాడు. భారత జాతీయ జట్టు తరపున ఆడుతున్న సమయంలో ధోనీ ఎప్పుడూ ఇంత ఎమోషనల్‌గా ప్రవర్తించలేదు. అతనికి టీమిండియా కంటే.. చెన్నై టీమ్‌పైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది. ధోనీ చేసిన తప్పిదానికి బీసీసీఐ ఇప్పటికే అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.

MS Dhoni

‘ధోనీ పెద్ద తప్పు చేసినా.. చిన్న జరిమానాతో బయటపడిపోయాడు. కానీ.. ధోనీపై కనీసం రెండు మూడు మ్యాచ్‌ల్లో నిషేధం విధించి ఉండాల్సింది. ఎందుకంటే.. ఈరోజు ఈ విషయాన్ని ఉదాసీనంగా వదిలేస్తే..? రేపు ఇంకో జట్టు కెప్టెన్ ఇలాంటి తప్పిదానికే పాల్పడతాడు. అప్పుడు అంపైర్లకి విలువేముంటుంది..? అలాకాకుండా.. ధోనీపై నిషేధం విధిస్తే.. అలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో..? అందరికీ తెలుస్తుంది.

అలా మైదానంలోకి వెళ్లాల్సిన అవసరమేముంది. బౌండరీ లైన్ వెలుపల ఫోర్త్ అంపైర్ అందుబాటులో ఉన్నాడు. మరోవైపు పిచ్ వద్ద ఇద్దరు చెన్నై బ్యాట్స్‌మెన్‌లు చర్చిస్తున్నారు. మరి ఎందుకు ధోనీ వెళ్లినట్లు..?’ అని సెహ్వాగ్ మండిపడ్డాడు. ఈ తీరుపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా ధోనీ తీరుని తప్పుబట్టారు.