లడఖ్‌లో జెండా ఆవిష్కరించనున్న ధోని..

277
dhoni

ఆగస్టు 15 సందర్భంగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని లడఖ్‌లోని లేహ్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ధోని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్‌ వెళ్లనున్నాడని సైనికాధికారులు తెలిపారు.

ఆగస్టు 15 వరకు ధోని తన విధుల్లో కొనసాగుతాడని..భారత ఆర్మీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెలిపారు. ప్రస్తుతం అతడు విధులు నిర్వర్తిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని… అలాగే సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడని చెప్పారు.

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను మోదీ సర్కార్‌ ఇటీవలే రద్దు చేసి.. జమ్ముకశ్మీర్‌, లద్దాక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.