షాద్‌నగర్‌లో మిషన్ భగీరథ వర్కషాప్‌..

410
Mission Bhagiratha
- Advertisement -

మిషన్ భగీరథ పనులు తక్కువ సమయంలోనే అత్యంత నాణ్యతతో పూర్తి కావడానికి విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్ విభాగం మెరుగైన పనితీరే కారణమన్నారు ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి. భగీరథ పనులు పూర్తి అయినట్టు వీ అండ్ క్యూసీ ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకమన్నారు. అందుకే విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాదనగర్ మండలం కమ్మదనంలో నిర్వహించిన మిషన్ భగీరథ వీ అండ్ క్యూసీ ఒక రోజు వర్క్ షాప్‌ను ప్రారంభించిన కృపాకర్ రెడ్డి, అధికారులు, ఇంజనీర్లతో కలిసి క్షేత్రస్థాయి భగీరథ పనులను పరిశీలించారు.

ముందుగా ఫారూఖ్ నగర్ మండలం అన్నారం గ్రామంలో పర్యటించారు. ఇంటింటి నల్లా కనెక్షన్స్‌ను చూశారు. నల్లా, ohsr ల క్వాలిటీని చెక్ చేయడంలో ఏ ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకోవాలో వివరించారు. ఆ తరువాత గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పనుల నాణ్యత, నీటి వినియోగంపై గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకున్నారు.

అంతకుముందు తమ గ్రామానికి నీటి సరఫరా సక్రమంగా రాకపోయేదని కానీ భగీరథలో తమ తాగునీటి కష్టాలు పూర్తిగా తీరాయన్నారు. భగీరథ నీటిని తాగడంతో గ్రామంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నారని సర్పంచ్ రాములు గౌడ్ చెప్పారు. అక్కడి నుంచి షాదనగర్ మండలం ఇప్పలపల్లి గ్రామం వెళ్లిన భగీరథ బృందం ఇంటింటి నల్లా కనెక్షన్స్‌ను పరిశీలించింది. గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకుంది.

ఆ తర్వాత కమ్మదనం నీటిశుద్ది కేంద్రంలో ఒక్క రోజు వర్క్ షాప్ జరిగింది. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే సమయంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరిశీలించాల్సిన అంశాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్,చీఫ్ ఇంజినీర్లు విజయ్ పాల్ రెడ్డి,చెన్నా రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,కన్సల్టెంట్ జగన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -