మిషన్ భగీరథపై అధ్యయనానికి కేంద్ర బృందం

411
mission bhagiratha
- Advertisement -

తెలంగాణలోని ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని అందించాలనే బృహత్ సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ భగీరథ. రూ .42,000 కోట్ల రూపాయలతో కృష్ణ, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి, 1.30 లక్షల కిలోమీటర్లు పైపులైన్ల మార్గం ద్వారా రాష్ట్రంలోని 24,000 గ్రామాలు మరియు 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

2016 ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. తద్వారా ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది.

ఇక శరవేగంగా పనులు జరుగుతుండగా త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం ఇవాళ రాష్ట్రానికి రానుంది. కేంద్ర తాగునీటి విభాగం ఉప సలహాదారు డీ రాజశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నది. ఎల్లూరులోని ఇంటెక్‌వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తోపాటు భగీరథ నీరు సరఫరా అవుతున్న గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోనుంది.

ఈ నెల 16న సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామాల్లో పర్యటిస్తుంది. ఆయా గ్రామాల్లో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది.17న శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్‌భగీరథ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమావేశం కానున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు,కేంద్రమంత్రులు మిషన్ భగీరథపై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే.

- Advertisement -