మహా గణపతి నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు..

386
Minister Talasani Srinivas Yadav
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అన్ని పండుగలను ఎంతో వైభంగా నిర్వహిస్తు.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంత్రి తలసాని ఎన్టీఆర్ మార్గ్‌లోని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ వినాయకుడిని ఈ నెల 12న మధ్యాహ్నం ఒంటి గంటకల్లా నిమజ్జనం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉదయం పదకొండు గంటలకు మండపం నుంచి తీసి మధ్యాహ్నం 12లోగా ఎన్టీఆర్ మార్గ్‌కి చేర్చుతామని చెప్పారు. ఈ భారీ విగ్రహం పూర్తిగా నీటిలో మునిగే విధంగా హుస్సేన్‌సాగర్‌లో 20అడుగులమేరకు పూడిక తొలగించినట్లు పేర్కొన్నారు.

హైద్రబాద్‌ నగరంలో సుమారు 55,000 గణేశ్ ప్రతిమలను ఏర్పాటుచేశారు.అందులో గత నాలుగు రోజుల్లో 3600 మినహా మిగిలినవన్నీ నిమజ్జనం జరిగినట్లు తలసాని పేర్కొన్నారు. మిగిలిన విగ్రహాలను చివరిరోజు 12న నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్ కాకుండా 26 కొలనులను సిద్ధంచేయడంతోపాటు 28 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారన్నారని మంత్రి తలసాని తెలిపారు.

talasani

ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ అడిషనల్ ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. నిమజ్జనం కార్యక్రమం చూసేందుకు భారీగా జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది భక్తులు ఇక్కడకు తరలిరానున్నారని, ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

దాదాపు రెండు వేలకు పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని సీపీ తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో ప్రైవేటు వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రజలు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ లలో మాత్రమే ప్రయాణించాలని సీపీ అనిల్ కుమార్ విఙ్ఞప్తి చేశారు.

- Advertisement -