క్రీడాకారులకు స్పోర్ట్స్ పాలసీ గొప్ప అవకాశం..

152
Minister Srinivas Goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తొలిసారిగా స్పోర్ట్స్ పాలసీపై రేపు సబ్ కమిటీ భేటీ అవుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ స్పోర్ట్స్ పాలసీపై ఏర్పాటు అయిన క్యాబినెట్ సబ్ కమిటీలో రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రికేటీఆర్‌,రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిలతో కూడిన మంత్రుల బృందం పాల్గొంటుంది.

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి,మౌళిక సదుపాయాల కల్పన,క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో పాటు దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకువస్తామన్నారు మంత్రి. అందుకు అవసరమైన సలహాలు, సూచనలను రాష్ట్రంలో ఉన్న సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లను, స్పోర్ట్స్ జర్నలిస్టులను, క్రీడా సంఘాలను, క్రీడా అవార్డు గ్రహీతల ద్వారా తీసుకుని, ఇతర రాష్ట్రాల, దేశాల క్రీడా పాలసీలను సైతం అధ్యయనం చేసి మెరుగైన క్రీడా పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తామన్నారు.

క్రీడాకారులకు గొప్ప అవకాశంగా ఈ స్పోర్ట్స్ పాలసీ తయారు చేస్తామన్నారు. దేశంలో క్రీడా రంగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో దేశంలో మిగితా రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. అలాగే క్రీడల్లో కూడ రోల్ మోడల్ స్టేట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఇప్పటికే గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు ముందుకు వస్తున్నారన్నారు.

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలో చాలా దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు మన దేశం వైపు చూస్తున్నారన్నారు. మన దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువైన రాష్ట్రం మన తెలంగాణ అని, ప్రతిఒక్క పారిశ్రామికవేత్త తెలంగాణ వైపు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ని చూపుతున్నారన్నారు.తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి వేల కోట్ల విలువైన భూములను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు.సంక్షేమం పథకాల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -