కల్వకుర్తిలో గులాబీ జెండా ఎగరాలి

49
ktrpraja

పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ పార్టీకి కండ్లు మండుతున్నయని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఇవాళ మహబూబ్ నగర్‌ జిల్లా కల్వకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ నాలుగేళ్లలో పేదల ముఖంలో చిరునవ్వులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం, పేదింటి ఆడబిడ్డకు కులం, మతం ఏదైనా షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మి సాయం చేస్తున్నామన్నారు.

ktrpraja

కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం క్యూలు కట్టే పరిస్థితి ఉండేదని, తమ ప్రభుత్వ పాలనలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని అందించామని, తమను మళ్లీ గెలిపిస్తే రానున్న రోజుల్లో ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు సాగునీరందించి కల్వకుర్తిని పచ్చటి మాగాణంగా మారుస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారని, మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారో చెప్పాలని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

ktrpraja

పాలమూరును ఎడారిగా మార్చి, వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని, కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే ఢిల్లీకి బానిసలుగా ఉండాలని, కాంగ్రెస్‌ పార్టీని బొంద పెడతామన్న టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుందని, పొత్తుల ముసుగులో మరోసారి తెలంగాణకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఇరు పార్టీలను ప్రజలే బొంద పెట్టాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు ప్రజలు నీళ్లు కావాలో.. కన్నీళ్లు కావాలో తేల్చుకోవాలి.. మరోసారి పాలమూరు ప్రజలు టీఆర్‌ఎస్‌కు పార్టీకి ఓటేసి పాలమూరు పౌరుషాన్ని చాటాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు.