డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశానికి మంత్రి హరీష్..

512
harish rao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా రాఘవాపూర్ గ్రామంలో రూ.1.57.25కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12.30 గంటలకు ఘనంగా జరిగాయి. సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టి, ఇంట్లో పుణ్యహావచనం, వైదిక పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహా ప్రవేశాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మలు ముఖ్య అతిథిలుగా హాజరై గృహా ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా గృహా ప్రవేశాలు జరిపి లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు. కొత్త ఇళ్లు మంచిగుందా అమ్మా అంటూ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

harish

మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ : రాఘవాపూర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దశల వారీగా ఇంకా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో అతి ఎక్కువ కుల సంఘ భవనాలు ఉన్న గ్రామం రాఘవాపూర్. నిరుపేదలైన ఎస్సీ, బీసీ, ఓసీలలోని అత్యంత నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు చేశామన్నారు మంత్రి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ‌ఇస్తున్నాం.డబుల్ బెడ్ రూమ్ కాలనీని క్లీన్‌గా ఉంచాల్సింది మీరే. డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఓ కమిటీ ‌వేసుకుని, కొంత మొత్తం ప్రతీ ఇంటి నుండి వసూలు‌ చేసుకోవాలి. ఆ డబ్బును కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధికి వినియోగించాలని హరిష్‌రావు సూచించారు.

minister harish rao

ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలి‌, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా చేసి పంచాయతీ సహకారాన్ని ఇవ్వాలి. ప్లాస్టిక్ నిషేధం విధించి గ్రామంలో ప్లాస్టిక్ వాడోద్దు. రూ.1 కోటి 50 లక్షలతో ఇండ్లు నిర్మించి, చాలా మంది నిరుపేదలకు ఇళ్లు కేటాయించాం. పిట్టల వాళ్లకు కూడా త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తాం.

కాళేశ్వరం నీళ్ల ద్వారా చెరువులు నింపి రెండు పంటలు పండించేందుకు కృషి చేస్తా. యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు తెస్తాం. కాల్వలకు భూములను ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలని గ్రామస్తులకు విన్నపం. రోడ్ల నిర్మాణం పనులు దశల వారీగా చేపడుతాం. అన్నీ వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శుభ్రంగా కాపాడుకోవాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేశ్, ఏంపీపీ శ్రీదేవి, జెడ్పిటీసీ శ్రీవారి గౌడ్, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -