మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.. మంత్రి ఎర్రబెల్లి

349
Minister Errabelli Dayakar Rao
- Advertisement -

ఇంటింటికి శుద్దమైన తాగునీటిని అందించే విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జులై 15 నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేయాలని ఆ తరువాత రాష్ట్రంలో ఎక్కడా నీటి సరాఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని… ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాల, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు.

మిషన్ భగీరథ పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఎన్సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పనుల పురోగతిని సమీక్షించారు. జిల్లాలు, సెగ్మెంట్లు వారీగా పనుల తీరును తెలుసుకున్నారు. రోజువారీ నీటి సరాఫరా, ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు.

Minister Errabelli Dayakar Rao

“మిషన్ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ అందరి పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిన ఉన్న కొంచెం పనులను జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఎంతో గొప్పది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు.

మిషన్ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతీ గ్రామంలో తాగునీటి సరాఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది. చివరిలో మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసి నీటిని అందిద్దాం. పనులు పూర్తి చేయడంతో పాటు తాగునీటి సరాఫరా నిర్వహణ చాలా కీలకం. ఎక్కడా ఏ ఒక్క రోజు నీటి సరాఫరాలో ఇబ్బందులు రాకుండా నిర్వహణ ఉండాలి.

 

 

గ్రామాల్లో తాగునీటి సరాఫరాకు ప్రత్యామ్నాయ వనరులు లేవన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ నిర్వహణ తీరు ఉండాలి. గ్రామాల్లో పాత వాటర్ ట్యాంకుల మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలి. వారంపది రోజుల్లో సర్పంచ్ లకు చెక్ పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రామపంచాయితీ నిధులతో ఈ ట్యాంకుల మరమ్మత్తు పనులు చేయించండి. సర్పంచ్ లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి.

Minister Errabelli Dayakar Rao

ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం గడువులోపు పూర్తి కావాలి. గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులు కీలకం. ఈ పనులను మరోసారి పరిశీలించి సరిచూసుకోండి. ఈ పనుల కోసం తవ్విన సిమెంట్ రోడ్లను వెంటనే పునరుద్దరించాలి. పాత రోడ్డు తరహాలోనే ఈ మరమ్మత్తు పనులు జరగాలి. ఎత్తు వంపులు లేకుండా చూసుకోండి. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్ వాడీలకు కచ్చితంగా నీటి సరాఫరా చేయాలి. దీనికి తగినట్టుగా పనులు చేయాలి”అని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

ఈ సమావేశంలో అధికారులు మిషన్ భగీరథ పనుల పురోగతిని మంత్రికి వివరించారు. “ మిషన్ భగీరథ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం అప్రమత్తతతో పనులు కొనసాగుతున్నాయి. పథకం అవసరాల కోసం ప్రతీరోజూ 0.16 టీఎంసీల నీరు సరాఫరా చేయాల్సి ఉంటుంది .ప్రస్తుతం 0.12 టీఎంసీలు సరాఫరా చేస్తున్నాము. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు మిషన్ భగీరథతోనే తాగునీరు అందించేలా పథకం పనులు ఉన్నాయి.

మిషన్ భగీరథతో 23968 ఆవాసాల్లోని 55,59,172 ఇండ్లకు తాగునీరు సరాఫరా చేయాలి .ప్రస్తుతం 22,210 ఆవాసాల్లోని 49,09,072 ఇండ్లకు నల్లాతో ప్రతీరోజు తాగునీరు సరాఫరా చేస్తున్నాము. మిగిలిన 1758 ఆవాసాల్లోని ఇంటింటికి కూడా త్వరలోనే నల్లాతో తాగునీటిని అందిస్తాము. నీటి కోసం పరిశ్రమల నుంచి కూడా చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి” అని వివరించారు.

- Advertisement -