మేడారం రోడ్ల విస్తరణపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

511
medaram
- Advertisement -

ఫిభ్రవరి నెలలో మేడారం జాతర ప్రారంభంకానుండటంతో రవాణా సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ . మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ లోపు అన్ని రకాల రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికులకు సాఫిగా ప్రయాణం సాగేలా చూడాలని చెప్పారు. జాతీయ రహదారుల విభాగం వరంగల్ డివిజన్ పరిధిలోని పనులపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ గురువారం హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ మంత్రి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రోడ్లు – భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్ఈ వసంత, ఈఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వరుస వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ఎక్కువ మంది భక్తులు మేడారం జాతరకు వస్తారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆలేరు, వంగపల్లి, వరంగల్ నగరం బైపాస్ రహదారుల పనులను వేగంగా పూర్తి చేయాలి. అలాగే ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, కరీంనగర్ మార్గాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా రోడ్లకు అవసరమైన మరమ్మత్తులు చేయాలి.

వరంగల్ – ఖమ్మం రహదారి బాగా దెబ్బతిన్నది. శాశ్వత మరమ్మత్తులతో పాటు తక్షణం తాత్కలికంగా మరమ్మత్తులను పూర్తి చేయాలి. వరంగల్ NH డివిజన్ కు సంబంధించి ప్రతిపాదన దశలో ఉన్న 5 రహదారులకు జాతీయ రహదారి హోదా వచ్చేలా డిల్లీ స్థాయిలో ఎంపీలు సంప్రదింపులు జరపాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలి. ఖాజీపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, మొండ్రాయి (గిర్ని తండ) జంక్షన్ అభివృద్ధి పనులను చేయాలి. జనగామ పట్టణంలో ప్రధాన రహదారి మరమ్మత్తు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

- Advertisement -