పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటా..:కేటీఆర్

196
mega IT park for Karimnagar
- Advertisement -

దేశంలోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరీనంగర్‌లో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్ పలు కంపెనీలతో ఎంవోయులు కుదుర్చుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్…ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు.

తెలంగాణ వాళ్లకు పాలన తెలియదని పరిశ్రమలు తరలిపోతాయని విషప్రచారం చేశారని కానీ ఆమాటలు అన్ని అవాస్తవాలని తెలిపోయాయని చెప్పారు. కేంద్రమంత్రులు సీఎం కేసీఆర్ పనితీరును కొనియాడుతుంటే రాష్ట్రంలోనే బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి ఇంటికీ మంచినీరు అందించే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రైతన్నలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్‌దే అన్నారు. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టులు సత్వరం పూర్తిఅయ్యేలా కష్టపడుతున్నారని తెలిపారు. తెలంగాణ  కోటి ఎకరాల మాగాణి అయితీరుతుందన్నారు.

దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ వృద్దిరేటు మెరుగ్గా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగరే కేంద్రబిందువని చెప్పిన కేటీఆర్….సీఎం కేసీఆర్ ఈ జిల్లాపై ప్రత్యేకదృష్టి సారించారని తెలిపారు. తెలుగువాళ్లు ఎక్కడికి వెళ్లినా సత్తాచాటుతున్నారని తెలిపారు. దేశానికి యువశక్తి అతిపెద్ద వనరుగా ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో యువత కీలకంగా పనిచేసిందని చెప్పారు కేటీఆర్. యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని…అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ముందుకు దూసుకుపోతోందని స్పష్టంచేశారు.ఐటీ రంగంలో మూడేళ్లలో లక్షమందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.

ఐటీని అన్నిజిల్లాలకు విస్తరిస్తున్నామని చెప్పిన కేటీఆర్ …వరంగల్‌,కరీంనగర్‌లో ఐటీ హబ్‌లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలోనే మరిన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. కరీంనగర్‌లో ఇవాళ వెయ్యిమందికి ఉద్యోగం కల్పించామన్నారు. కరీంగనర్ ఎన్నారైలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కోరారు. తాను కరీంనగర్‌లో పుట్టాననే చెప్పిన కేటీఆర్‌ పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటానని  మరిన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తామని స్పష్టంచేశారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఓ కుగ్రామంలా మారిపోయిందన్నారు. టీ పైబర్‌తో ఇంటర్నెట్ సేవలు మరింత విస్తరించనున్నాయని చెప్పారు. త్వరలోనే కరీంనగర్‌లో టాస్క్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. టీహబ్‌ కేంద్రాన్ని ఐటీ టవర్‌లో ఏర్పాటుచేస్తామన్నారు. యువత కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు.

మానేరు రివర్ ఫ్రంట్ రాబోతుందన్నారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో కరీంనగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. తాగునీరు,సాగునీరు,కరెంట్,రోడ్లు లాంటి కనీసవసతులు కల్పిస్తున్నామన్నారు.  పరిశ్రమలు రావడంతోనే ప్రభుత్వం బాధ్యత అయిపోలేదని…ఉద్యోగాలు వచ్చినప్పుడే అందరికల సాకారం అవుతుందన్నారు.

- Advertisement -