50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

581
mareddy srinivas reddy
- Advertisement -

ఖరీఫ్‌లో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని తెలిపారు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. బియ్యం నాణ్యతపై టెక్నికల్‌, విజిలెన్స్‌ బృందాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. 2019-20 ఖరీఫ్‌ కార్యాచరణపై పౌరసరఫరాల భవన్‌లో రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌తో మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది ఖరీఫ్‌లో 40.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయగా, ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిందని తెలిపారు. పౌరసరఫరాల సంస్థ గత ఏడాది ఖరీఫ్‌, రబీలో 77 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని, రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

ధాన్యం దిగుబడులను దృష్టిలో పెట్టుకొని కీలకమైన ఈ సమయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని రైస్‌ మిల్లర్లను కోరారు. మిల్లర్లపై తమకు ఎలాంటి దురుద్దేశ్యం లేదని, వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కారించడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావుగారు ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలకు, మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందిస్తున్నారని, ఇందుకోసం మిల్లర్ల నుండి ఏడాదికి 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.ఈ బియ్యం నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడబోమని, మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఇటీవల పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు సన్నబియ్యం నాణ్యతపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చాలా చోట్ల క్వాలిటీ, క్వాంటిటీ సరిగ్గా లేదన్న విషయం బహిర్గతమైంది. పాఠశాల విద్యార్థులు, హెడ్‌మాస్టర్ల నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో పాఠశాలల్లో, హాస్టళ్లలో వండిన అన్నంను ప్రత్యక్షంగా పరిశీలించాలని జిల్లా డీసీఎస్‌ఓ, డీఎంలకు ఆదేశించడం జరిగిందన్నారు.

బియ్యం నాణ్యత విషయంలో వార్డెన్లు, హెడ్‌మాస్టర్లు, డీఈఓలు నేరుగా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.సమావేశంలో కమిషనర్‌గారు మాట్లాడుతూ ఈ ఏడాది 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఇందుకోసం 12 కోట్ల గన్నీ సంచులు అవసరమని, మిల్లర్ల దగ్గర ఉన్న సర్వీసబుల్‌ గన్నీ సంచులను వెంటనే పౌరసరఫరాల సంస్థకు అప్పగించాలని కోరారు.

2020 వరకు రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన బియ్యం నిల్వలు పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్నాయని, ఈ ఖరీఫ్‌లో కేవలం 12 లక్షల టన్నుల రా రైస్‌ను మాత్రమే పౌరసరఫరాల సంస్థ తీసుకుంటుందని, ఇందుకు సంబంధించిన ధాన్యాన్ని రా రైస్‌ మిల్లులకు సీఎంఆర్‌ కింద ఇస్తామని, మిగిలిన ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించవలసి ఉంటుందని తెలిపారు.

ధాన్యం కేటాయింపుల్లో మరింత పారదర్శకంగా వ్యవహరిస్తామని, గత ఏడాది మిల్లర్ల పనితీరు, మిల్లుల సామర్థ్యం, రవాణా వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్యం కేటాయింపులు జరుపుతామని తెలిపారు. నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే మిల్లులను బ్లాక్‌ లిస్టులో పెట్టడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

- Advertisement -