మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్‌..

132
Manchu Manoj

ప్రస్తుతం చెన్నై వాసులు మంచినీటి కొరతతో అల్లాడిపోతున్నారు. తాగడానికి మంచి నీరు లేక నానా యతన పడుతున్న చెన్నై నగర వాసులను ఇప్పటికే అక్కడి హీరోల సహాయంలో అభిమానులు త్రాగునీరు అందిస్తున్నారు. ఈ బాటలో తెలుగు హీరో కూడా నడుస్తున్నాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సినీ నటుడు మంచు మనోజ్ చెన్నై ప్రజలకు నీటి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. తాజాగా ఈ హీరో ట్యాంకర్లతో చెన్నై ప్రజలకు మంచినీరు సరఫరా చేస్తున్నారు.

మనోజ్ పంపిస్తున్న ట్యాంకర్ల వద్ద జనాల రద్దీ చూస్తే తాగునీటి ప్రాధాన్యత ప్రస్తుతం చెన్నై సిటీని ఎంత వేధిస్తుందో తెలుస్తోంది. దీనిపై మనోజ్ స్పందిస్తూ, మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో తాగునీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నానని తెలిపారు. తాను పెరిగిన ప్రాంతం కావడంతో చెన్నై పట్ల తనకు మమకారం ఉందని, అందుకే తనవంతు సాయం చేస్తున్నానని ట్వీట్ చేశారు.

Manchu Manoj

మ‌నోజ్ గ‌తంలో హుదూద్‌ తుఫాను, వరదల సమయంలో వెంటనే స్పందించి తన వంతు సాయం అందించిన సంగ‌తి తెలిసిందే. హుద్ హుద్ సమయంలో తెలుగు ప్రజలు ఎలాగైతే సహాయం అందించారో.. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలానే ముందుకు వచ్చి సహాయం అందివ్వాలని మంచు మనోజ్ సోషల్ మీడియాద్వారా కోరుతున్నారు. ఇక త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి ప‌ళ‌ని స్వామి కూడా నీటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న చెన్నై ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.65 కోట్లు కేటాయించారు.